తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదం విషయంలో నెలకొన్న వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తిరుపతి లడ్డూపైనే వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి. వైకాపా హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన కల్తీ నెయ్యిని ఉపయోగించారని ఆరోపణలు రావడం.. జాతీయ మీడియా సైతం ఈ ఇష్యూపై ఫోకస్ పెట్టడం.. అది పొలిటికల్ గా టర్న్ తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. లడ్డూ వివాదంలో విపక్షంలో ఉన్న వైసీపీ, అధికార ఎన్డీయే కూటమి నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు పలు సూటి ప్రశ్నలు సంధించారు.
`వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేవుడిని దర్శించుకోవచ్చు. అయితే ఆయనకు దేవుడిపై నమ్మకం ఉందా లేదా అనేది ముఖ్యం. నమ్మకం ఉంటే అన్యమతస్థులు సాంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా..? ఆ సాంప్రదాయాన్ని గౌరవించకపోతే నువ్వు తిరుమల ఎందుకు వెళ్లాలి..? నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పని చేయమని కాదు.
అది అడిగితే బూతులు తిట్టారు. ఆంజనేయస్వామికి చెయ్యి నరికేస్తే ఏమైంది బొమ్మే కదా? అన్నారు… హనుమంతుడు బొమ్మా? వెంకటేశ్వరస్వామి బొమ్మా?… రాములవారి తల తీసేస్తే ఏముంది ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా? అన్నారు. రధం కాలిపోతే తేనెటీగలు వచ్చాయి అన్నారు. తిరుమల పోటులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమౌతుంది? అని అడిగారు.
ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. అందుకే బాధపడుతూ చెబుతున్నా. మనం అందరం ఉండి కూడా భగవంతుడికి ఇలా అపరాధం జరిగిందేది మన బాధ. అందుకే భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలి. ఇక భగవంతుడే చూసుకుంటాడు అది వేరే విషయం. ఏ మతం వారైనా.. వేరే మతం వారిని చులకనగా చూడటం కరెక్టు కాదు. అపచారం చేసి ఆ అబద్ధాలను నిజాలుగా చేయాలని చూడటం స్వామి ద్రోహం` అంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి ముఖ్యమంత్రి ప్రశ్నలకు జగన్ సమాధానం ఇస్తారా? లేదా? అన్నది చూడాలి.