ఏపీలోని కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత.. తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైంది ఉచిత ఇసుక. ఎన్నికలకు ముందు కూడా టీడీపీ అధినేత హోదాలో చంద్రబాబు ఇదే విషయంపై ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వస్తే.. ఇసుకను ఉచితంగా అందిస్తామన్నారు. అప్పటి వరకు వున్న వైసీపీ ప్రభుత్వం ఇసుకను కూడా పేదలకు అందకుండా చేసిందని.. దీంతో భవన నిర్మణ రంగం పూర్తిగా దెబ్బతిన్నదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అనేక మంది కార్మికులు బలవన్మరణాలకు కూడా పాల్పడ్డా రని తెలిపారు. ఈ క్రమంలో తాము ఉచిత ఇసుకను తీసుకువస్తున్నట్టు చెప్పారు.
చెప్పినట్టుగానే సర్కారు ఏర్పడిన నెల రోజుల్లోనే ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించారు. 2014-19 మధ్య అమలైన ఉచిత ఇసుక విధానాన్నే ప్రస్తుతం కొనసాగిస్తామని చంద్రబాబు వెల్లడించారు. అనుకున్నట్టుగానే ఆయన విధానం ప్రకటించారు. ఆగ స్టు 15న ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టారు. కట్ చేస్తే.. తాజాగా చంద్రబాబు ఈ విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక విధానంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయని.. ఎవరు బడితే వాళ్లు విమర్శిస్తున్నారని అన్నారు. అక్కడితో కూడా.. ఇలా ఆరోపణలు చేసేవారిని గుర్తించి కేసులు పెట్టాలని, కఠినంగా వ్యవహరించాలని కూడా ఆదేశించారు.
మరి చంద్రబాబుకు ఇంత కోపం రావడానికి కారణాలు ఏంటి? అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది? తప్పు ఎక్కడ ఉంది? అనేవి కీలక ప్రశ్నలు. ఈ విషయాలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం లేదు. పైపైన చూసినా.. విధానంలోనే బలమైన లోపాలు కనిపిస్తున్నాయి. ఉచితం అన్న మాటే కానీ.. వాస్తవానికి గతం కంటే ఎక్కువ సొమ్ములు పెట్టి ఇప్పుడు కొనుగోలు చేయాల్సి వస్తోందని.. టీడీపీ నేతలే అంతర్గత సమావేశాల్లో చెబుతున్నారు. గతంలో 10 టన్నుల ఇసుక 6 వేల వరకు ఉంటే.. ఇప్పుడు 10 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. మరి ఈ తేడాకు కారణమేంటన్నది ప్రశ్న.
అంతేకాదు.. ఉచిత ఇసుక విధానంలో ప్రభుత్వం చెబుతున్న తీరుకు, క్షేత్రస్థాయిలో ఈ విధానం అమలవుతున్న తీరుకు ఎక్కడా పొంతనలేదు. కేవలం రవాణా చార్జీలు, కూలి చార్జీలు చెల్లించి ఇసుకను తీసుకుని పోవచ్చు. అని సర్కారు ప్రచారం చేస్తోంది. దీనికి సంబంధించి సీనియర్ ఐఏఎస్‌లను, పోలీసులను కూడా వినియోగిస్తోంది. ప్రత్యేకంగా పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇసుక ఉచితం అని చెబుతున్నారు. కానీ, ఇస్తున్న రసీదుపైనే అసలు మతలబు కనిపిస్తోంది. రవాణా చార్జీలను భారీ ఎత్తున మోపేస్తున్నారు. సొంత వాహనం తెచ్చుకుని కూడా రవాణా చార్జీలను అధికారులకు చెల్లించాల్సి వస్తోంది. ఇక, ఎలాంటి విషయం పేర్కొనకుండా దీనికి రెట్టింపు సొమ్మును వసూలు చేస్తున్నారు.
ఫలితంగా 20 టన్నుల ఇసుక 17 వేల రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోంది. అంటే.. పేరుకు ఉచిత ఇసుక అయిపోయినా ఫలితం మాత్రం ప్రజలకు చేరడం లేదు. మరి ఇంత సొమ్ము ఒక్క రవాణా, కూలీలకే చెల్లిస్తున్నారా? అనేది సామాన్యుల ప్రశ్న. సో.. సోషల్ మీడియాలో ఒక పద్ధతి ప్రకారం అయితే.. ఎక్కడా వ్యతిరేక ప్రచారం జరగడం లేదనేది టీడీపీ నేతలే చెబుతున్న మాట. ఉన్నదే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యతిరేక ప్రచారాన్ని కేసులతో కట్టడి చేయడం కంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తే.. చంద్రబాబుకు వాస్తవాలు తెలుస్తాయని అంటున్నారు పరిశీలకులు.