2021 నవంబర్ 19…ఆనాడు ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడును వైసీపీ సభ్యులు అవమానించారు. దీంతో, ఈ కౌరవ సభలో తాను ఉండబోనని, ముఖ్యమంత్రి అయిన తర్వాతే గౌరవ సభలో అడుగుపెడతానని చంద్రబాబు శపథం చేశారు. ఆ శపథాన్ని నెరవేర్చుకున్న చంద్రబాబు చెప్పినట్లుగా ముఖ్యమంత్రి హోదాలో ఈ రోజు గౌరవ శాసన సభలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు టీడీపీ సభ్యులు, జనసేన సభ్యులు ఘన స్వాగతం పలికారు.
కౌరవ సభ పోయి గౌరవ సభ వచ్చింది…నిజం గెలిచింది..ప్రజా స్వామ్యం గెలిచింది..అంటూ టీడీపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే తీవ్ర భావోద్వేగాల మధ్య అసెంబ్లీలోకి చంద్రబాబు నాలుగో సారి ముఖ్యమంత్రిగా అడుగుపెట్టారు. అంతకుముందు శాసన సభ మెట్లకు చంద్రబాబు ప్రణామం చేసి మోకరిల్లారు.
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ 16వ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ నియమించిన ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ముందుగా ప్రమాణ స్వీకారం చేయగా….ఆ తర్వాత జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారి శాసన సభ్యుడిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత మంత్రులు ప్రమాణం చేశారు. ఎమ్మెల్యేగా నారా లోకేశ్ తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు.
ఇక, మంత్రుల తర్వాత ఎమ్మెల్యేగా ఏపీ మాజీ సీఎం జగన్ ప్రమాణం చేసేలా అనుమతించాలని వైసీపీ నేతలు చేసిన రిక్వెస్ట్ కు సీఎం చంద్రబాబు ఓకే చెప్పారు. దీంతో, మంత్రుల తర్వాత జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఇంగ్లిష్ ఆల్ఫాబెట్స్ క్రమంలో పేర్ల ప్రకారం మిగతా సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
అసెంబ్లీకి బయలు దేరే ముందు చంద్రబాబుకు ప్రజలు నీరాజనాలు పలికారు. దారి పొడువునా జేజేలు పలుకుతూ అసెంబ్లీకి సాగనంపారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లారు. ఆ తర్వాత చంద్రబాబు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అసెంబ్లీలోని తన ఛాంబర్ లో అడుగుపెట్టారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పవన్ వెంట జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.
https://x.com/JaiTDP/status/1804009169097494556?t=QhFn09bxvyCuhdlRfRBBiQ&s=03