సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టయి బెయిల్ పై విడుదలైన టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ను పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు పరామర్శిస్తున్నారు. నేరుగా కొందరు వెళ్లి అల్లు అర్జున్ కలిసి సంఘీభావం ప్రకటిస్తుండగా, మరికొందరు ఫోన్ చేసి అల్లు అర్జున్ ను పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. అల్లు అర్జున్ కు ధైర్యం చెప్పిన చంద్రబాబు కేసు పూర్వాపరాలను, పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
నిన్న అల్లు అరవింద్ కు కూడా చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడిన సంగతి తెలిసిందే. మరోవైపు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ లు కూడా అల్లు అర్జున్ కు ఫోన్ చేసి పరామర్శించారు. వాస్తవానికి అల్లు అర్జున్ ను ప్రభాస్ ఈరోజు నేరుగా కలుస్తారని ప్రచారం జరిగింది. అయితే, షూటింగ్ పనుల్లో బిజీగా ఉండడం వల్ల ప్రభాస్ రాలేకపోయారు. అందుకే, ఫోన్ చేసి పరామర్శించారు.
మరోవైపు తారక్ కూడా వార్-2 షూటింగ్ లో తలమునకలై ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ ను నేరుగా కలవలేకపోయారు. షూటింగ్ పూర్తయిన తర్వాత తప్పకుండా వచ్చి కలుస్తానని అల్లు అర్జున్ తో తారక్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇక, టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ స్వయంగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కలిసి పరామర్శించారు. అల్లు అర్జున్ కు వెంకీ సంఘీభావం ప్రకటించారు.
అల్లు అర్జున్ నివాసానికి అక్కినేని అఖిల్, అడవి శేష్ తదితర హీరోలు వచ్చి పరామర్శించారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఉదయం నుంచి అల్లు అర్జున్ నివాసంలోనే ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ను ఆయన మేనత్త, చిరంజీవి సతీమణి సురేఖ పరామర్శించారు. ఈ సందర్భంగా సుకుమార్ తో పాటు సురేఖ కూడా ఎమోషనల్ అయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్ పై టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల స్పందించారు. ఈ అరెస్టు ఘటన బాధాకరమని, ఈ కేసులో అల్లు అర్జున్ ఎంతో పరిణతితో వ్యవహరించారని శ్రీలీల చెప్పారు.