రాజమండ్రి శివారులో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రవీణ్ మృతి యాక్సిడెంట్ వల్ల జరగలేదని, ఆయనను హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని పోలీసులను ఆయన ఆదేశించారు.
పాస్టర్ ప్రవీణ్ మరణంపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయిస్తామని హామీ ఇచ్చారు. ప్రవీణ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించిన లోకేశ్ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారని నిర్ధారించారు. అయితే, పలు క్రైస్తవ సంఘాలు పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ కు హోం మంత్రి అనిత ఫోన్ చేసి ఆరా తీశారు.
హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై బయల్దేరిన ప్రవీణ్ అర్ధరాత్రి సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారని పోలీసులు తెలిపారు. రహదారి పైనుంచి ప్రమాదవశాత్తు కిందకు పడిపోయారని, వాహనం ఆయనపై పడిపోవడంతో బలమైన గాయాలయ్యాయని వెల్లడించారు. అంతేకాదు, ఉదయం 9 గంటల వరకు ఆయనను ఎవరూ గమనించలేదని, ఆ క్రమంలోనే ఆయన గాయాలతో చనిపోయారని తెలిపారు.