ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోయిందని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే జగన్ విధ్వంసకర పాలనకు భయపడి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు పరిశ్రమలు సంస్థలు ముందుకు రాలేదు. దీంతో రాష్ట్రాభివృద్ధి కుంటుపడి ఖజానా ఖాళీ అయింది. దీనికి తోడు అందిన కాడికి అప్పులు తెచ్చిన జగన్ సంపద సృష్టించడంలో విఫలం కావడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు తన అనుభవంతో ఏపీని అభివృద్ధి పథంలో నడిపేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇదే విషయాన్ని GoIStats తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. 2024-25 సంవత్సరానికి గాను దేశంలోనే అత్యధిక వృత్తి రేటు సాధించిన రాష్ట్రాల జాబితాలో ఏపీ రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. ఏపీ 8.21% వృద్ధి సాధించిందని, ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు తాము తీసుకున్న విధానాలు రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి అభివృద్ధి పథం వైపు నడిపించాయని అన్నారు.
వ్యవసాయం, తయారీ, సేవల రంగాల్లో విస్తృత పునరుజ్జీవనం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారీ పెట్టుబడులు ఈ ప్రగతికి చోదకాలుగా నిలిచాయని వెల్లడించారు. ఈ విజయం ప్రజలందరిదని చెప్పారు. అందరం కలసికట్టుగా కృషి చేసి మరింత రాష్ట్రానికి ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు.