తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం 9:30 గంటలకు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ భేటీ జరగనుందని కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ప్రకటించారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిసిన డీకే శివకుమార్ రేపు సీఎల్పీ నేతను ఎన్నుకున్న తర్వాతే ప్రమాణస్వీకారం, సీఎం అభ్యర్థిపై క్లారిటీ ఇస్తామని మీడియాతో అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కొన్ని విధివిధానాలు ఉన్నాయని, దాని ప్రకారం సీఎల్పీ నేతను ఎన్నుకున్న తర్వాతే సీఎం అభ్యర్థి ఎవరు అన్నది ప్రకటిస్తామని డీకే చెప్పారు.
వాస్తవానికి ఈరోజు రాత్రి సీఎల్పీ భేటీ ఉంటుందని, రేపే సీఎం అభ్యర్థి ప్రమాణస్వీకారం ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే పలు నియోజకవర్గాల నుంచి గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థులంతా హైదరాబాద్ కు చేరుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండడంతో రేపు ఉదయం 9:30 గంటలకు సిఎల్పీ భేటీ నిర్వహించాలని డీకేతో పాటు రేవంత్ రెడ్డి తదితరులు నిర్ణయించారు. గెలుపొందిన అభ్యర్థుల జాబితాను గవర్నర్ కు అందించామని, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని గవర్నర్ కు చెప్పామని డీకే అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి 65 మంది అభ్యర్థులు గెలుపొందారని, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం తమకు ఉందని డీకే అన్నారు.
అయితే, కాంగ్రెస్ తరపున సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ఎంపిక లాంఛనమే అయినప్పటికీ అధికారికంగా కాంగ్రెస్ పెద్దలనుంచి ఎటువంటి ప్రకటన వెలువడం లేదు. మరోవైపు సీఎం కుర్చీ రేసులో ప్రస్తుత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తాను ఉన్నాను అంటూ ఈరోజు ఉదయం మీడియాతో అన్న సంగతి తెలిసిందే. అయితే, భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి బుజ్జగించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.