అనంతపురం జిల్లా. టీడీపీకి కంచుకోట. కొన్ని దశాబ్దాలుగా పార్టీని నడిపిస్తున్న నాయకులు ఇక్కడ ఉన్నారు. మంత్రి పదవులు..పార్టీ పదవులు..అనేకం ఇక్కడి వారు సొంతం చేసుకుంటూనే ఉన్నారు. పార్టీ తరఫున ఎవరు బరిలో నిలిచినా.. తిరుగులేదనే భావన పార్టీ అధిష్టానంలోనూ…ప్రజల్లోనూ ఉంది. ఇది వాస్తవమే. అయితే.. వైసీపీ దూకుడుతో ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది.
2019 ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ కేవలం రెండు ఎమ్మెల్యే స్థానాలకే పరిమితమైంది. లోక్ సభ నియోజకవర్గంసహా మిగిలిన అన్ని నియోజకవర్గాలలోనూ వైసీపీ పాగా వేసింది. అన్నింటినీ గుండుగుత్తుగా ఎగరేసుకుపోయింది. సరే.. ప్రజల నాడి మారింది.. వైసీపీ సునామీ.. జగన్ పాదయాత్రల ప్రభావం ఉంది.. కనుక సహజంగానే ఇది జరిగి ఉంటుందని పార్టీలో విశ్లేషణలు వచ్చాయి. అందరూ సరిపెట్టుకున్నారు.
కానీ, తాజాగా జరిగిన మూడు దశల పంచాయతీ ఎన్నికలలోని చాలా స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ నాయకులు చెప్పుకోవడానికి కూడా మిగలకుండా..మెజారిటీ పంచాయతీలను కైవసం చేసుకుంది. మరి దీనిని ఎలా చూడాలి. 2019 ఎన్నికల పూర్తయినప్పటి నుంచి పంచాయతీ ఎన్నికలు జరిగేనాటికి 20 నెలల సమయం పట్టింది. మరి ఈ 20 నెలల కాలంలో జగన్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత ప్రబలిందని టీడీపీనే చెబుతున్నా.. ఆ తరహా ప్రభావం ఇక్కడ కనిపించలేదు.
పోనీ.. టీడీపీ నేతలు పుంజుకున్నారా? అంటే.. అది కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఓటమికి టీడీపీ నేతల మధ్య సమన్వయలోపమే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నరీతిలో వ్యవహరిస్తుండడంతో పార్టీపై ప్రజలకున్న అభిప్రాయాలు మారిపోతున్నాయి. మరికొద్ది వారాలలోనే కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. 2013 ఎన్నికల్లో అనంతపురం కార్పొరేషన్‌ను టీడీపీ కైవసం చేసుకుంది.
అయితే.. ఇప్పుడు కూడా ఆ స్థానాన్ని టీడీపీ దక్కించుకుంటుందా? లేదా అన్నది ప్రశ్నార్థకం. టీడీపీ నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి మనస్పర్థలు వీడి కలిసికట్టుగా ముందుకు సాగితేనే వైసీపీని ఎదుర్కోగలరన్న భావన కేడర్ లో వ్యక్తమవుతోంది. అలా కాకుండా ఎవరికి వారుగా గ్రూపు రాజకీయాలు చేసుకుంటూ వర్గపోరు పోతే వైసీపీ నే ఇక్కడ పాగా వేయడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి ఆ దిశగా టీడీపీ సీనియర్లు ఆలోచన చేస్తారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.