భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన పేరు ప్రముఖంగా వార్తల్లో వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థపై విమర్శలు చేసేవారిపై ఉక్కుపాదం మోపుతోన్న తెలుగు తేజం న్యాయ వ్యవస్థ గౌరవాన్ని ఇనుమడింపజేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. సందర్భానుసారంగా న్యాయవ్యవస్థ యొక్క ప్రాధాన్యతను, న్యాయ మూర్తులు సమాజంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కోర్టులలో మౌలిక సదుపాయాలు వంటి విషయాలపై గొంతెత్తుతున్నారు.
ఈ క్రమంలోనే తెలుగు తేజం సీజేఐ ఎన్వీ రమణ మరో అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు. భారత్, పాక్ సరిహద్దుల్లోని వాఘా బోర్డర్‌ను సందర్శించిన తొలి భారత ప్రధాన న్యాయమూర్తిగా ఆయన చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. వాఘా బోర్డర్‌ను సతీసమేతంగా ఎన్వీ రమణ సందర్శించారు. ఈ సందర్భంగా భారత సరిహద్దు రక్షక దళం(బీఎస్ఎఫ్) గౌరవ వందనాన్ని జస్టిస్ ఎన్వీ రమణ స్వీకరించారు. సీజేఐగా పలు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన జస్టిస్ ఎన్వీ రమణ.. తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకోవడంపై తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, తెలంగాణ హైకోర్టుకు ఏపీకి చెందిన జడ్జిలను బదిలీ చేస్తున్నారంటూ హైకోర్టు వద్ద తెలంగాణ న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ జడ్జిలను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేస్తూ… ఏపీ జడ్జిలను తెలంగాణకు బదిలీ చేస్తున్నారని తెలంగాణ న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. తెలంగాణ జడ్జిలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ అంశంపై సీజేఐ ఎన్వీ రమణకు ఫిర్యాదు చేస్తామని వారు చెప్పారు. తెలంగాణకు చెందిన జడ్జిలను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయొద్దని కోరతామని అన్నారు.