షెడ్యూల్ కులాల వర్గీకరణ రిజర్వేషన్ల అంశంపై ఏపీ సీఎం జగన్ గతంలో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎస్సీల వర్గీకరణ రాష్ట్ర పరిధిలో లేదని, అది కేంద్రం చేతిలో ఉందని జగన్ చేతులు దులుపుకున్నారు. ఎస్సీల వర్గీకరణ చేస్తామంటూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఈ క్రమంలోనే ఇరు తెలుగు రాష్ట్రాలలో ఎస్సీల వర్గీకరణకు అనుమతివ్వాలని ఈ వ్యవహారంపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆ వ్యవహారంపై ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం విచారణ జరిపింది.
ఆ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. ఎస్సీల వర్గీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని దేశపు అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఆ వర్గీకరణ అంశం కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ పరిధిలో ఉందని, అవి మాత్రమే ఆ సమస్య పరిష్కరించాలని పేర్కొంది. దాంతోపాటు, ఎస్సీ వర్గీకరణపై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. పంజాబ్, తమిళనాడులో ఎస్సీ వర్గకరణ కొనసాగుతోంది. దీంతో, ఇరు తెలుగు రాష్ట్రాలలో కూడా వర్గీకరణకు అనుమతివ్వాలని పిటిషన్ దాఖలైంది.
వాస్తవానికి 2004లో ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు రద్దు చేసింది. 2004లో వర్గీకరణ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి సుప్రీం ధర్మాసనం సిపారసు చేసింది. విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణపై శాశ్వత తీర్పు ఇవ్వాలని తాజా పిటిషన్లో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుకు కోరారు. ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం ధర్మాసనం… కేంద్రంతో పాటు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.
మరోవైపు, సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పందించారు. 18 ఏళ్ల పాటు ఎస్సీ వర్గీకరణ లేక మాదిగ ఉప కులాలు నష్టపోయాయన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఏడుగురు లేదా ఎనిమిది మంది జడ్జీల లార్జర్ బెంచ్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేశామన్నారు. త్వరలోనే తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని మంద కృష్ణమాదిగ ఆశాభావం వ్యక్తం చేశారు.