సీఎం జగన్ అస్తవ్యస్థ పాలన, అపరిపక్వ నిర్ణయాలతో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విపక్షాలు మొదలు జాతీయ మీడియా వరకు గగ్గోలు పెడుతున్నాయి. తన మానస పుత్రికలైన నవరత్నాలు, ఉచిత పథకాల కోసం ఖజానాలోని డబ్బులను పప్పు బెల్లాల్లాగా జగన్ పంచిపెడుతున్న వైనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతన్నాయి. జగన్ ఇదే ఫాంలో అప్పులు చేస్తే ఏపీ మరో శ్రీలంక కావడానికి ఎంతో కాలం పట్టదని ఆర్థిక నిపుణుల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి.
ప్రధాని మోదీ మొదలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరకు అందరూ ఏపీ అప్పులు…వాటి కోసం జగన్ పడుతున్న తిప్పలపైనే వార్నింగ్ లు ఇస్తున్నారు. మొన్నటికి మొన్న ఉచిత పథకాలు రాష్ట్రాల అభివృద్ధికి, దేశాభివృద్ధికి ప్రతిబంధకాలని మోదీ కూడా అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఉచిత పథకాలపై దేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది.
ఉచిత పథకాల ఎర వేస్తున్న రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని, అలా చేసే పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసి ఎన్నికల గుర్తును సీజ్ చేయాలని అశ్విని ఉపాధ్యాయ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం 6.5 లక్షల కోట్ల అప్పు ఉందని, భారత్ కూడా మరో శ్రీలంక అవుతుందని కోర్టుకు తెలిపారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఉచిత హామీలు, పథకాలను ఆయా పార్టీలు నియంత్రించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది.
ఈ విషయంలో ఎన్నికల సంఘం ఏమీ చేయలేదా? అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఉచిత హామీలను నియంత్రించే అధికారం తమకు లేదని సుప్రీం కోర్టులో సీఈసీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఉచిత పథకాలతో రాష్ట్రాలపై ఆర్థిక ప్రభావం ఎలా ఉంటుందో ఓటర్లే నిర్ణయించుకోవాలని కోర్టుకు తెలిపింది. ఉచిత పథకాలపై రాష్ట్రాలు వెచ్చించే మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఆయా రాష్ట్రాలకు రెవెన్యూ కేటాయింపులను నియంత్రించవచ్చా? అనే అంశాన్ని ఫైనాన్స్ కమిషన్ను అడిగి తెలుసుకోవాలని కేంద్రానికి సూచించింది. ఈ పిటిషన్ తదుపరి విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది. దీంతో, జగన్ ఉచిత పథకాలపై పరోక్షంగా సీజేఐ ఎన్వీ రమణ స్పందించినట్లయింది.