భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈరోజు విజయవాడలో పర్యటించిన సంగతి తెలిసిందే. విజయవాడలో నూతన కోర్టు భవనాల సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈనెల 27తో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ పదవీకాలం ముగియనున్న సంగతి తెలిసిందే. దీంతో, అధికారికంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఆయనకు ఏపీలో ఇదే చివరి పర్యటన.
ఈ నేపథ్యంలోనే ఆ భవనాల సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో జస్టిస్ ఎన్వి రమణ ఎమోషనల్ అయి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సభలో సీఎం జగన్ తెలుగులో మాట్లాడారని, రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగులో మాట్లాడిన తర్వాత తాను తెలుగులో మాట్లాడకపోతే బాగుండదని జస్టిస్ ఎన్వీ రమణ తెలుగులో తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సభలో వక్తలంతా ఆంగ్లంలో అనర్గళంగా ప్రసంగించారని, కాబట్టి ముఖ్యమంత్రి గారు, తాను తెలుగులో మాట్లాడితే ప్రత్యేకత ఉంటుందని అన్నారు.
దేశంలోని పలు కోర్టుల భవనాల నిర్మాణానికి కేంద్ర నిధులు ఇవ్వాలని తాను కోరానని, కానీ, దానిపై కేంద్రం నుంచి కొంత వ్యతిరేకత వచ్చిందని అన్నారు. కానీ, ఏపీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు తమకు మద్దతుగా నిలిచి ఆ భవనాల నిర్మాణానికి నిధులిచ్చి పూర్తి చేశారని, ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.
విజయవాడలో భవనాల నిర్మాణానికి జగన్ సహకరించి నిధులు ఇవ్వడంతోనే వాటి నిర్మాణం ఇప్పటికైనా పూర్తయిందని గుర్తు చేశారు. అలాగే, విశాఖపట్నంలో భవనాల నిర్మాణానికి సంబంధించి కూడా చిన్న సమస్య ఉందని, అక్కడ కూడా భవనాల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉందని అన్నారు. అయితే, ఆ నిర్మాణాలు పూర్తి కావడానికి కూడా జగన్ మద్దతిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకు కూడా సహకరిస్తానని జగన్ అన్నారని వెల్లడించారు.
ఇక, న్యాయ వ్యవస్థ పై ప్రజలు విశ్వాసం కోల్పోతే అది ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదకరమని సీజేఐ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. అందుకు, ప్రభుత్వాల భాగస్వామ్యం కూడా అవసరమని ఆయన చెప్పారు. ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించే బాధ్యత న్యాయవాదులపై ఉందని, జూనియర్ న్యాయవాదులను సీనియర్ న్యాయవాదులు ప్రోత్సహించాలని కోరారు.
తాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదిగడం వెనుక చాలామంది సహకారం ఉందని, తన ఉన్నతికి, విజయానికి కారణమైన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. తన హయాంలో 25 మంది హైకోర్టు న్యాయమూర్తులను, 11 మంది సుప్రీంకోర్టు జడ్జిలను, 15 మంది హైకోర్టు చీఫ్ జస్టిస్ లను నియమించగలిగానని అన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో హైకోర్టు న్యాయమూర్తులను నియమించగలిగానని అన్నారు తనకు అధికారం, అవకాశం ఉన్నంతవరకు అన్ని వర్గాల వారికి అవకాశాలు అందేలా చూశానని చెప్పారు.