హైదరాబాద్లో నిర్మించతలబెట్టిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ కు సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ భూమిపూజ చేశారు. భారతదేశంలో మొట్టమొదటి IAMC అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం నిర్మాణానికి హైదరాబాద్ వేదిక కాబోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. గచ్చిబౌలిలోని ఐకియా వద్ద 3.7 ఎకరాల విలువైన భూమిని సీఎం కేసీఆర్ ఇచ్చారని, దాని వల్ల తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ ఖ్యాతి మరింతగా పెరుగుతుందని ఆయన కొనియాడారు.
ఎంతో విలువైన భూమిని కేటాయించినందుకు సీఎం కేసీఆర్ కు జస్టిస్ ఎన్వీ రమణ ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు, రూ.50 కోట్లను నిర్మాణానికి కేటాయించడం ఈ బృహత్తర కార్యక్రమానికి ముందడుగన్నారు. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం వల్ల హైదరాబాద్ కు మరింత పేరు వస్తుందని, సింగపూర్ తరహాలో హైదరాబాద్ మధ్యవర్తిత్వ కేంద్రం కూడా ప్రపంచ ఖ్యాతి పొందాలని ఆయన ఆకాంక్షించారు. రాబోయే ఏడాది ఈ సమయానికల్లా భవన నిర్మాణం పూర్తి కావాలని ఆశిస్తున్నానని చెప్పారు.
ఇక, ఈ భవన నిర్మాణానికి సహకరించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు జడ్జి లావు నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్బిట్రేషన్ సెంటర్ నిర్మాణానికి సహకరించిన సీజేఐ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు ధన్యవాదాలు తెలిపారు. స్వల్ప అస్వస్థత వల్ల కేసీఆర్ ఈ కార్యక్రమానికి రాలేకపోయారని, ఆయన త్వరగా కోలుకొని ప్రజలకు మంచి సేవలందించాలని భగవంతుని కోరుకుంటున్నానన్నారు. హైదరాబాద్ సెంటర్ కు సింగపూర్, లండన్ ఆర్బిట్రేషన్ సెంటర్ లకు ఉన్నంత మంచి పేరుప్రఖ్యాతలు రావాలని లావు నాగేశ్వరరావు ఆకాంక్షించారు.