భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ. ఏపీలోని కృష్నాజిల్లాకు చెందిన ఆయన సీజేఐ హోదాలో తొలిసారి రాష్ట్రానికి వస్తే.. ఎలాంటి ఘన స్వాగతం లభించాలి? ప్రభుత్వం నుంచి అధికార పార్టీ నేతల నుంచి ఎంతటి గౌరవం దక్కాలి? కానీ, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు అలాంటి దేమీ దక్కలేదని.. అధికార పార్టీ నేతలు న్యాయమూర్తి ముందుకు రాలేక పోయారు.
సీజేఐగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. తొలిసారి జస్టిస్ ఎన్వీ రమణ.. తిరుమల శ్రీవారి దర్శనానికి కుటుంబ సమేతంగా గురువారం రాత్రి విచ్చేశారు. వాస్తవానికి భారత ప్రధాన న్యాయమూర్తి స్థాయికి చేరుకున్న తెలుగు తేజానికి అఖండమైన స్వాగతం దక్కుతుందని అనుకున్నారు.
కానీ, తిరుమలలో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఇతర అధికారుల స్వాగతం మాత్రమే లభించింది. కానీ, తిరుగు ప్రయాణంలో.. తెలంగాణలో అడుగు పెట్టిన సీజేఐ ఎన్వీ రమణకు అక్కడ ఘన స్వాగతం లభించడం విశేషం.
తెలంగాణ రాజ్‌భవన్ చేరుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. అంతేకాదు.. ఆయన ప్రయాణించిన ప్రధాన రహదారిపై బ్యానర్లు కటౌట్లు కూడా ఏర్పాటు చేసి.. ఎనలేని మర్యాదతో స్వాగతం పలికారు.
మరి ఏపీలో జన్మించిన.. జస్టిస్ ఎన్వీరమణకు ఇక్కడ ఎందుకు అంత గౌరవం లభించలేదనేది ఆయన అభిమానులు, ఇతర వర్గాల ప్రధాన ప్రశ్న.
ఆది నుంచి కూడా చంద్రబాబు సామాజిక వర్గంపై వైసీపీ అధినేత, సీఎం జగన్ ఒక విధమైన వైఖరిని అవలంభించడంతోపాటు, గతంలో సుప్రీం న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రమణకు వ్యతిరేకంగా లేఖలు సంధించిన విషయం తెలిసిందే. అదేసమయంలో అనేక అక్రమ కేసులు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఏపీలో లేకపోయినా.. ఇతర నేతలు సైతం.. జస్టిస్ ఎన్వీ రమణకు స్వాగతం పలికేందుకు, ఆయనను పలకరించేందుకు కూడా ముందుకు రాలేదని.. ముఖం చెల్లలేదని.. అంటున్నారు పరిశీలకులు.
ఏదేమైనా.. మన తెలుగు వాడు.. దేశానికే గర్వకారణమైన పోస్టులో ఉంటూ.. తొలిసారి తెలుగు గడ్డపై అడుగు పెడితే.. అధికార పార్టీ నేతలు కానీ.. స్థాని క ప్రజాప్రతినిధులు కానీ.. పలకరించలేక పోవడంపై సర్వత్రా విస్మయం కలిగిస్తోంది.