అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఈనెల 15వ తేదీ నుండి సినిమా థియేటర్లను తెరుచుకునేందుకు కేంద్రప్రభుత్వం అనుమితించినా తెరుచుకునే అవకాశాలు దాదాపు లేదనే చెప్పాలి. దాదాపు ఏడు మాసాల క్రితం కరోనా వైరస్ దెబ్బకు దేశమంతా లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయిన విషయం అందరికీ తెలిసిందే. కొని నెలల తర్వాత వైరస్ వ్యాప్తి ఉధృతి తగ్గుముఖం పడుతోందన్న కారణంతో కేంద్రం మెల్లి మెల్లిగా కొన్ని రంగాలకు లాక్ డౌన్ నుండి సడలింపులు ఇస్తోంది. ఇందులో భాగంగానే ఈనెల 15వ తేదీ నుండి సినిమా థియేటర్లను తెరుచుకోవచ్చని అనుమతించింది.
కేంద్రం అనుమతించినా యాజమాన్యాలు మాత్రం అందుకు సిద్దంగాలేవు. కారణాలు ఏమిటంటే గ్యారెంటి బిజినెస్ లేకపోవటం, ప్రతి షోకు థియేటర్ మొత్తాన్ని శానిటైజ్ చేయాల్సి రావటం, థియేటర్ మొత్తం కెపాసిటిలో సగం సీట్లను మాత్రం భర్తి చేసేందుకు అనుమతులివ్వటం, ప్రతి థియేటర్లోను స్క్రీనింగ్ కోసమని థర్మల్ టెస్టింగ్ ఏర్పాట్లు చేసుకోవటం లాంటి అనేక కారణాల వల్ల యాజమాన్యాలు భయపడిపోతున్నాయి. రాష్ట్రం మొత్తం మీద చిన్నా, పెద్ద, సింగిల్ స్క్రీన్, మల్టి స్క్రీన్ అన్నీ కలిపి సుమారు 1650 థియేటర్లున్నాయి. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా థియేటర్లు తెరుకుకోవాలంటే మొత్తం 24 నిబంధనలను అమలు చేయాల్సిందే అంటూ ప్రభుత్వం షరతులు విధించింది.
ఇన్ని షరతులు పాటించి థియేటర్లను రన్ చేయాలంటే నష్టాలో ముణిగిపోవటం ఖాయమని థియేటర్ల యాజమాన్యాలు మొత్తుకుంటున్నాయి. థియేటర్ మొత్తం మీద 65 శాతం సీట్లు భర్తీ అయితేనే లాభనష్టాలు లేకుండా బ్యాలెన్స్ అవుతుందట. 50 శాతానికన్నా తగ్గితే మాత్రం నష్టం ఖాయమని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. ప్రభుత్వ షరతుల ప్రకారం థియేటర్ కెపాసిటిలో సగం టికెట్లే ఇవ్వాలి. పైగా జనాలను ఆకర్షించటానికి కొత్త సినిమాలు కూడా ఏమీ లేవట. ఎందుకంటే కరోనా వైరస్ దెబ్బకు చాలామంది హీరోలు, హీరోయిన్లు ఇంకా షూటింగులకు హాజరవ్వటం లేదు. కాబట్టి చాలా సినిమాల షూటింగ్ ఆగిపోయాయి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతిరోజు శానిటైజ్ చేయించాలంటే చాలా ఖర్చవుతుంది. ఇక లాక్ డౌన్ కారణంగా మూసేసిన థియేటర్లను రెడీ చేయాలన్నా బాగానే చేతి చమురు వదులుతుంది. కొన్ని వందల థియేటర్లలో కరెంటు బిల్లులు చెల్లించని కారణంగా కనెక్షన్లు కట్ చేసేశారు. మళ్ళీ కనెక్షన్లు తీసుకోవాలంటేనే ప్రతి థియేటర్ కు లక్షల్లో బిల్లులు చెల్లించాలి. ఇపుడు థియేటర్ ను మూసేసినా నిర్వహణ ఖర్చు క్రింద నెలకు లక్షన్నర రూపాయలు అవుతోంది. అదే థియేటర్లు తెరిస్తే నిర్వహణకు సుమారు రూ. 4 లక్షలవుతుందని ఎగ్జిబిటర్ల సంఘం లెక్కలేసింది.
కాబట్టి ఒకవేళ థియేటర్లు తెరిచినా అయ్యే భారాన్ని జనాల నుండే వసూలు చేసుకునేందుకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించాలంటూ అడగాలని డిసైడ్ చేశారు. అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో టికెట్ ధరలు పెంచితే జనాలు వస్తారా ? అనేది కూడా డౌట్. ఇన్ని సమస్యలతో థియేటర్లు తెరవటం కన్నా మూసి ఉండటమే మేలని కూడా ఎగ్జిబిటర్ల సమావేశంలో యాజమానులు ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. మరి ఏం చేస్తారో చూడాల్సిందే.