టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ పై సీఎం జగన్ కక్ష సాధిస్తున్నారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీలో టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణపై కేసు నమోదు అయింది. ఆ తర్వాత ఆయన చికిత్స కోసం అమెరికా వెళ్లేందుకు బెయిల్ మంజూరు కాగా ఆ నిర్ణయాన్ని చిత్తూరు జిల్లా సెషన్స్ కోర్టు రద్దు చేసింది. దీంతో, తన బెయిల్ రద్దు చేస్తూ చిత్తూరు కోర్టు ఇచ్చిన తీర్పును నారాయణ హైకోర్టులో సవాల్ చేశారు.
ఇక, నారాయణ బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కానీ, నారాయణ బెయిల్ రద్దు చేస్తూ చిత్తూరు కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. నారాయణను రిమాండ్ కు ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ పోలీసులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ కు మాత్రం విచారణార్హత ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్ వేసే వరకు పిటిషనర్ పై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అని పోలీసులకు గతంలో హైకోర్టు ఆదేశించింది.
ఆ తీర్పుతో నారాయణకు ఊరట లభించిందనుకుంటున్న తరుణంలో తాజాగా ఆయనకు ఏపీ సీఐడీ మరో షాక్ ఇచ్చింది. నారాయణ కుమార్తె ఇళ్లలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్ పల్లిలోని నివాసాల్లో వారు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి బృందాలుగా విడిపోయిన అధికారులు తనిఖీలను నిర్వహిస్తున్నారు. కానీ, ఏ విషయంలో నారాయణ కుమార్తె నివాసంలో సోదాలు చేస్తున్నారనే విషయాన్ని మాత్రం సీఐడీ అధికారులు వెల్లడించలేదు. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.