అమరావతి రాజధానిగా ఏర్పాటు చేస్తూ బాబు సర్కారు అప్పట్లో తీసుకున్న నిర్ణయం.. అనంతరం రైతుల నుంచి భూసేకరణ చేయటం తెలిసిందే. ఈ భూముల కేటాయింపు విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన విచారణ కోసం సీఐడీ ఈ రోజు (మంగళవారం) ఉదయం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో నోటీసులు అందజేశారు.
ఆరుగురు సభ్యులతో కూడిన అధికారుల టీం బాబు ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఇదే కేసుకు సంబంధించి చంద్రబాబుతో పాటు మరో కీలక నేతకు కూడా నోటీసులు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. ఒక ప్రముఖ మీడియా చానల్ పేర్కొన్న వివరాల ప్రకారం చంద్రబాబుతో పాటు.. అప్పట్లో మంత్రిగా వ్యవహరించిన నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణకు కూడా నోటీసులు అందించినట్లు చెబుతున్నారు.
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ దారుణ ఓటమి తర్వాత నుంచి నారాయణ రాజకీయాల్లోనూ.. పార్టీ కార్యక్రమాల్లోనూ యాక్టివ్ గా ఉండటం లేదు. అమరావతి భూములకు సంబంధించిన వ్యవహారాల్ని ఆయనే చూసుకున్నారు. దీంతో.. ఆయనకు కూడా నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో లేని నారాయణకు.. నోటీసులు అందించినట్లుగా చెబుతుననారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాల్సినట్లుగా కోరినట్లు తెలుస్తోంది.అయితే.. దీనికి సంబంధించిన మరింత సమాచారం బయటకు రావాల్సి ఉంది.