రెండు.. మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజేశ్ ఉదంతం హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే. హైదరాబాద్ మహానగరంలో తనను ఒక కారు.. రెండు టూవీలర్లు ఫాలో అయ్యాయని పేర్కొనటంతో పాటు.. నగరం మొత్తం రౌండ్లు వేయించిన ఆయన్ను.. చివరకు గుర్తు తెలియని ఒకరు ఆయన కారుకు అడ్డు పడటం.. మా సారు రమ్మంటున్నారంటూ వ్యాఖ్యానించటం తెలిసిందే. దేనికి గురించి? ఎవరు మీ సారు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకపోవటం తెలిసిందే.
ఈ ఎపిసోడ్ లో జూబ్లీహిల్స్ పోలీసులకు కిలారు రాజేశ్ కంప్లైంట్ ఇవ్వటం తెలిసిందే. ఏపీ స్కిల్ స్కాంలో ఆయన పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను ఏపీ సీఐడీ అధికారులు ఫాలో అయినట్లుగా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. ఏపీ స్కిల్ ఉదంతంలో తనను సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సాక్షిగా హాజరు కావాలంటూ సీఐడీ నోటీసులుజారీ చేసింది. అంతేకాదు.. వారి వెబ్ సైట్లో తనను నిందితుడిగా చూపిస్తూ.. లుకౌట్ నోటీసులు జారీ చేసిందని పేర్కొంటూ కిలారు రాజేశ్ ఏపీ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ నోటీసుల్ని రద్దు చేయాలని కోరారు.
తనను విచారించేందుకు ఇంటెలిజెన్స్ డీజీ.. మరికొందరు ప్రయత్నించటం చట్టవిరుద్దమైన చర్యగా ప్రకటించాలన్న ఆయన.. తనకు స్కిల్ డెవలప్ మెంట్ సంస్థకు.. సీమెన్స్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను టీడీపీ కార్యకలాపాల్లో చురుకైన పాత్రను పోషించటం కారణంగా తనను వేధిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. తనకు నోటీసులు ఇవ్వకుండా సీఐడీని నిలువరించాలని కోరారు.
ఇదిలా ఉండగా.. సీఐడీ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది వివేకానంద.. పిటిషనర్ పేరును వెబ్ సైట్లో నిందితునిగా పేర్కొనటంలో పొరపాటు జరిగిందని చెప్పారు. పిటిషనర్ కిలారు రాజేశ్ పేరును తొలగించాలంటూ అధికారులకు మౌఖికంగా చెప్పినట్లుగా పేర్కొన్నారు. ఈ అంశంపై కౌంటర్ వేసేందుకు గడువు కోరారు. దీంతో.. తదుపరి విచారణ కోసం ఈ నెల 17కు కేసును ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.