ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. దీంతోపాటు, చంద్రబాబును 5 రోజులప పాటు సీఐడీ కస్టడీకి కోరింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు చంద్రబాబుకు ఊరటనిచ్చేలా కీలక ఆదేశాలు జారీ చేసింది. సోమవారం వరకు చంద్రబాబును కస్టడీకి కోరవద్దని సీబీఐ అధికారులను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అంతేకాదు, చంద్రబాబు తరఫు లాయర్లు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను ఈనెల 19కి హైకోర్టు వాయిదా వేసింది.
ఆ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సిఐడి అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఆ వ్యవహారంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, వాదనలు జరగాల్సి ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. సోమవారం వరకు చంద్రబాబును కస్టడీకి అప్పగించవద్దని చంద్రబాబు తరఫు న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ తదితరులు వాదనలు వినిపించారు. ఏపీ సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.
మరోవైపు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ ఈ రోజే జరగనుంది. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో లంచ్ మోషన్ పిటిషన్ పై కూడా విచారణ ఈ రోజు జరుగుతోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు రిమాండ్ రిపోర్టు, ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో మంగళవారం నాడు క్వాష్ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా తాజాగా హైకోర్టు ఆదేశాలతో చంద్రబాబుకు ఊరట లభించిందని, సోమవారం నాడు చంద్రబాబుకు మరింత ఊరట లభించాలని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.