వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఆ వీడియో ఫేక్ కాదు ఒరిజినల్ అని ,అందులో ఉన్నది గోరంట్ల మాధవ్ అని టీడీపీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అంతేకాదు, అది ఒరిజినల్ వీడియో అని నిర్ధారణ చేస్తూ అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణుడు జిమ్ స్టాఫోర్డ్ ఇచ్చిన నివేదికను కూడా టీడీపీ నేతలు మీడియా ముందుకు తెచ్చి గోరంట్ల గుట్టు రట్టు చేశారు.
అయితే. అసలు గోరంట్ల మాధవ్ వీడియో ఫోరెన్సిక్ ల్యాబ్ కు వెళ్ళకముందే అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఆ వీడియో ఫేక్ అని తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చేశారు. దీంతో, అసలు ఏపీకి చెందిన ల్యాబ్ గానీ, మరే ల్యాబ్ గానీ అది ఫేక్ వీడియో అని నిర్ధారణ చేయకముందే ఫకీరప్ప ఫోరెన్సిక్ నిపుణుడి మాదిరిగా అది ఫేక్ వీడియో అని నిర్ధారించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత జరుగుతున్నా సరే వైసీపీకి మద్దతుగా నిలుస్తున్న కొంతమంది పోలీసులు, కొందరు అధికారుల తీరు మాత్రం మారడం లేదు.
ఈ క్రమంలోనే వైసీపీ నమ్మిన బంటు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న ఏపీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఆ వీడియో వ్యవహారంలో రంగంలోకి దిగారు. అయితే, అందరిలా కాకుండా సునీల్ కొంచెం కొత్తగా గోరంట్లకు అండగా నిలిచారు. ఏకంగా మాధవ్ వీడియో ఒరిజినల్ అని తేల్చిన జిమ్ పైనే సునీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిమ్ ఇచ్చిన సర్టిఫికెట్ ఒరిజినలా? కాదా? ఆయన చెప్పిన విషయాలు అసలైనవా కావో తేల్చాలని సునీల్ కుమార్ ను జగన్ సర్కార్ కోరిందట.
దీంతో, సునీల్ కుమార్ ఈ మెయిల్ ద్వారా సంప్రదించగా తన పేరుతో వెలువడిన ల్యాబ్ రిపోర్ట్ ఒరిజినల్ కాదని, అది ఫేక్ రిపోర్ట్ అని జిమ్ రిప్లై ఇచ్చారట. పోతిని రామ్ అనే వ్యక్తి ఆ రిపోర్టులో మార్పులు చేయాలని జిమ్ ను కోరారట. అయితే, దాని గురించి ఆలోచించే లోపే మార్పులు చేర్పులు చేసి తన పేరుతో నివేదికను విడుదల చేశారని జిమ్ వాపోయారట. ఇక, తాను ఇచ్చిన సర్టిఫికెట్ కు, మీడియాలో కనిపిస్తున్న సర్టిఫికెట్ కు తేడా ఉండటంతో జిమ్ అది ఫేక్ సర్టిఫికెట్ అని తేల్చి కూడా చెప్పేశారట. ఇటువంటి ఫేక్ సర్టిఫికెట్లను ప్రచారం చేస్తున్న వారిపై కూడా సునీల్ కుమార్ చర్యలకు సిద్ధమవుతున్నారట.
ఇక, మాధవ్ వీడియోపై సునీల్ కుమార్ కొత్త భాష్యం చెప్పారు. ఆ వీడియోలో ఒక పురుషుడు, ఒక మహిళ సంభాషించుకుంటున్నారని, వారి ఫోన్లో ఉన్న కంటెంట్ మాత్రమే ఒరిజినల్ అని చెప్పుకొచ్చారు. దానిని పరీక్షిస్తేనే అసలు విషయం తేలుతుందని సునీల్ కుమార్ అన్నారు. అంతేకాదు , జిమ్ కూడా ఇదే విషయం స్పష్టం చేశారట. ఇక, వీడియోలోని కంటెంట్ ఒరిజినలో, గ్రాఫిక్సో తేల్చేందుకు సునీల్ కుమార్…ఆర్ఆర్ఆర్ సినిమాలో జంతువుల గ్రాఫిక్స్ సీన్లను కూడా వాడేశారు.