మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అవకతవకలు జరిగాయని మార్గదర్శి చిట్ ఫండ్స్ చైర్మన్ రామోజీరావును, ఆయన కోడలు శైలజా కిరణ్ ను ఏపీ సీఐడీ అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, 30 మంది మార్గదర్శి చిట్స్ మేనేజర్లను కూడా సీఐడీ విచారణ జరపడం, నలుగురు బ్రాంచ్ మేనేజర్లను సీఐడీ అరెస్ట్ చేయడం తెలిసిందే. కేవలం రాజకీయ కక్షతోనే 86 ఏళ్ల వయసులో వృద్ధాప్యంలో ఉన్న రామోజీరావును అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ సిఐడి అధికారులు విచారణ జరిపిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
ఇక, ఆ తరహా సోదాలు జరిపే అధికారం లేదని తెలిసినా…రామోజీరావే టార్గెట్ గా మరోసారి ఏపీ సర్కార్ పావులు కదుపుతోంది. తాజాగా మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ నుంచి రూ.793 కోట్ల నగదును అటాచ్ చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేయడం సంచలనం రేపుతోంది. చిట్ ఫండ్ చట్టాన్ని అతిక్రమించి నిధులను దారి మళ్లించారని రామోజీరావు తదితరులపై ఆరోపణలు రావడంతో సీఐడీ విచారణ చేపట్టింది.
చిట్స్ ద్వారా వసూలైన డబ్బును స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం, మ్యూచువల్ ఫండ్స్ కు బదలాయించడం వంటి ఆరోపణలున్నాయి. ఈ కేసులో సీఐడీ రామోజీరావును ఏ-1గా, శైలజా కిరణ్ ను ఏ-2గా సీఐడీ పేర్కొంది. మాజీ ఎంపీ, సీనియర్ పొలిటిషియన్ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ మార్గదర్శి కేసులో స్వయంగా వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరి, తాజా పరిణామంపై రామోజీరావు స్పందన ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.