స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జ్యుడీషియల్ కస్టడీ ఈ రోజుతో ముగియనున్న సంగతి తెలిసిందే. దీంతో, చంద్రబాబుకు మరో 15 రోజుల పాటు రిమాండ్ పొడిగించాలని కోరుతూ సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో పిటిషన్ దాఖలు చేశారు. ఇక, చంద్రబాబు తరఫు లాయర్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై కూడా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాది దూబే హోరాహోరీగా వాదనలు వినిపిస్తున్నారు.
కేబినెట్ నిర్ణయం ప్రకారం ఒప్పందం అమలు జరగలేదని పొన్నవోలు వాదిస్తున్నారు. ఒప్పందంలో జరిగిన తప్పిదాలకు చంద్రబాబే బాధ్యుడని అన్నారు. 27 కోట్ల రూపాయలు నేరుగా టీడీపీ ఖాతాలో జమ అయ్యాయని పొన్నవోలు ఆరోపించారు. ఇక, 13 చోట్ల చంద్రబాబు సంతకాలు పెట్టారని వాదనలు వినిపించారు. కొన్ని బ్యాంక్ లావాదేవీలపై చంద్రబాబును ఇంకా విచారణ జరపాల్సి ఉందని పోన్నవోలు చెప్పారు. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ చంద్రబాబుకు అప్లై అవుతుందని, చంద్రబాబును కస్టడీకి తీసుకుని మరిన్ని విషయాలు రాబట్టాలని పొన్నవోలు వాదనలు వినిపించారు. మరోవైపు, ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు జరుగుతున్నాయి.