సీఎం జగన్ చిన్నాన్న, దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ మిస్టరీ సినిమా థ్రిల్లర్ ను మరపించేలా మలుపులు తిరుగుతోంది. అప్రువర్ గా మారిన దస్తగిరి రెండోసారి ఇచ్చిన వాంగ్మూలంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ హత్య ఘటనపై ఆనాడు పులివెందుల సీఐగా ఉన్న శంకరయ్య చెప్పిన విషయాలు ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపుతున్నాయి.
వివేకా మృతదేహంపై గాయాలు బయటకు కనబడకుండా పువ్వులు పేర్చే ప్రయత్నం చేశారని శంకరయ్య షాకింగ్ ఆరోపణలు చేశారు. హత్య సమాచారం అందిన వెంటనే తాను ఘటనా స్థలానికి చేరుకున్నానని, ఫ్రీజర్ లో మృతదేహాన్ని పెట్టే ప్రయత్నాన్ని తాను అడ్డుకున్నానని చెప్పారు. పోస్టుమార్టం తర్వాత ఫ్రీజర్‌లో పెట్టాలని ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి తేల్చి చెప్పానని, ఆ విషయాన్ని వారు ఎంపీ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి, మనోహర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని వెల్లడించారు.
న్యాయవాది ఓబుల్‌రెడ్డి వివేకా ఇంటికి వచ్చిన తర్వాతే ఆధారాల ధ్వంసం కార్యక్రమం మొదలైందని శంకరయ్య చెప్పినట్లు తెలుస్తోంది. తనకు అవినాష్‌రెడ్డి నుంచి ఫోన్ వచ్చిందని, వివేకా గుండెపోటుతో మరణించారని, జనాన్ని కంట్రోల్ చేసేందుకు సిబ్బందిని పంపాలని ఆయన కోరారని గుర్తు చేసుకున్నారు. అయితే, ఇంట్లోకి కానిస్టేబుళ్లు వెళ్లకుండా శివశంకర్‌రెడ్డి అడ్డుకున్నారని, తనను మాత్రమే లోపలికి పంపారని పేర్కొన్నారు.
ఇంట్లో, వివేకా డెడ్ బాడీపై రక్తపు మరకలు, గాయాలు చూసి అది గుండెపోటు అనిపించడం లేదని శివశంకర్‌రెడ్డితో చెప్పానని అన్నారు. గాయాల విషయం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని శివశంకర్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. వివేకా సహాయకుడు ఇనయతుల్లాను కూడా శివశంకర్‌రెడ్డి బెదిరించారని శంకరయ్య తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
బాత్రూంలో హత్యకు గురైన వివేకా మృతదేహాన్ని గంగిరెడ్డి బెడ్రూములోకి తీసుకొచ్చారని, డెడ్ బాడీ దుస్తులను మార్చేందుకు ప్రయత్నించారని, పోస్టుమార్టం జరిగేవరకు దుస్తులు మార్చడానికి వీల్లేదని తాను అడ్డుకున్నానని వాంగ్మూలమిచ్చారు. ఘటనా స్థలాన్ని వీడియో తీస్తుండగా శివశంకర్‌రెడ్డి గట్టిగా కేకలు వేశారన్నారు. ఎర్ర గంగిరెడ్డి, ఎవీ కృష్ణారెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి ల ప్రవర్తన అనుమానాలు రేకెత్తించిందని వివరించారు.
వివేకా గుండెపోటుతో చనిపోయారని అవినాశ్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డే తొలుత ప్రచారం ప్రారంభించారని శంకరయ్య వాంగ్మూలంలో పేర్కొన్నారు. వివేకా హత్యకేసుపై కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదని అవినాష్‌రెడ్డి,శివశంకర్‌రెడ్డి
ఆధారాల ధ్వంసం అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డిల పర్యవేక్షణలోనే జరిగిందని, ఆ సమయంలో ఇంట్లోకి ఎవరూ ప్రవేశించకుండా భాస్కరరెడ్డి తలుపులు మూసివేశారని గుర్తు చేసుకున్నారు.
ఈ విషయాన్ని అప్పటి ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ దృష్టికి తాను తీసుకెళ్లినట్టు చెప్పారు. ఆయన ఆదేశాల ప్రకారం కేసు నమోదు చేసినట్టు చెప్పారు. 28 జులై 2020న సీబీఐ అధికారుల ఎదుట శంకరయ్య ఇచ్చిన ఈ సంచలన వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చి ప్రకంపనలు రేపుతోంది