గత ఏడాది ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఎన్నికల తర్వాత పార్టీ నుంచి ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోతున్నారు. ఐదేళ్లపాటు పదవితో పాటు పార్టీలో గౌరవం పొందిన నేతలు వరుసగా వైసీపీకి వీడ్కోలు పలుకుతున్నారు. రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు సైతం పదవులు వదులుకొని పక్క చూపులు చూస్తున్నారు. తాజాగా జగన్ కు మరో బిగ్ షాక్ తగిలింది.
విశాఖకు చెందిన కీలక నేత పార్టీని వీడారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, విశాఖ-కాకినాడ పెట్రో కారిడార్ రీజియన్ మాజీ చైర్మన్ చొక్కాకుల వెంకటరావు ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం వెల్లడించారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపినట్టు ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం పార్టీలో నేతలు, కార్యకర్తలకు తగిన గుర్తింపు దక్కడం లేదని, అధికారంలో ఉన్న ఐదేళ్లు రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేసిన జగన్ మళ్లీ గెలిచే పరిస్థితి లేదని చొక్కాకుల వెంకటరావు అన్నారు. అలాగే భవిష్యత్తులో అనుచరులతో చర్చించి ఏ పార్టీలో చేరాలన్నది నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. కాగా, ఇప్పటికే విశాఖకు చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మరో నేత అడారి ఆనంద్ కుమార్ వైసీపీని వీడారు. ఇప్పుడు సీనియర్ నాయకుడైన చిక్కాకుల కూడా పార్టీకి గుడ్ బై చెప్పడం విశాఖ వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.
వైసీపీని స్థాపించిన తొలినాళ్లలోనే చొక్కాకుల వెంకటరావు పార్టీలో చేరారు. 2013లో విశాఖ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్తగా పని చేశారు. 2014 ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన చొక్కాకుల రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. కానీ బీజేపీలో ఇమడలేక మళ్లీ వైసీపీ గూటికే చేరారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక వెంకట్రావు సతీమణి లక్ష్మికి విశాఖపట్నం, కాకినాడ పెట్రోలియం కెమికల్ అండ్ పెట్రో కెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ గా అవకాశాన్ని కల్పించారు జగన్. ఆ తర్వాత చొక్కాకుల కూడా అదే సంస్థకు చైర్మన్ గా వర్క్ చేశారు. ఇక పార్టీలో సరైన పాధాన్యత దక్కకపోవడంతో యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్న చొక్కాకుల వెంకటరావు తాజాగా వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు.