గాడ్ ఫాదర్ మూవీకి సరైన ప్రమోషన్లు లేవని, ఈ సినిమాకు హైప్ తేవడంలో చిత్ర బృందం విఫలమైందని మెగా అభిమానులే నిన్నటి దాకా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఐతే ఈ రోజు పది సెకన్లు కూడా నిడివి లేని ఒక చిన్న ఆడియో క్లిప్‌ను రిలీజ్ చేసి ఈ సినిమాకు బోలెడంత పబ్లిసిటీ తెచ్చి పెట్టాడు చిరు. “నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను కానీ… రాజకీయం నా నుంచి దూరం కాలేదు” అనేది ఆ డైలాగ్.
మంగళవారం ఉదయం చిరు ఈ చిన్న డైలాగ్‌తో కూడిన ఆడియో క్లిప్‌ను రిలీజ్ చేసి ఊరుకున్నారు. దాని గురించి వేరే కామెంట్ కూడా పెట్టలేదు. ఇక అంతే రచ్చ షురూ అయింది. మీడియా వాళ్లు ఈ డైలాగ్ మీద టీవీల్లో పెద్ద పెద్ద డిస్కషన్లు పెట్టేశారు. నిజానికి ఇది గాడ్ ఫాదర్ మూవీలోని డైలాగ్. ఆ సినిమా అంతా రాజకీయాల చుట్టూనే తిరుగుతుంది. ఇందులో చిరు ముఖ్యమంత్రికి దత్తపుత్రుడి పాత్రలో కనిపిస్తాడు. తన తండ్రి చనిపోయాక తన సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని విలన్ అండ్ బ్యాచ్ ప్రయత్నిస్తున్నపుడు చిరు రంగంలోకి దిగుతాడు.
ఈ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని “నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను కానీ… రాజకీయం నా నుంచి దూరం కాలేదు” అనే డైలాగ్ పెట్టినట్లున్నారు. కానీ ఈ డైలాగ్‌ను చిరు వ్యక్తిగత జీవితానికి అన్వయించి.. టీవీల్లో చర్చలు పెట్టేశారు. చిరుకు రాజకీయాల మీద ఆసక్తి తగ్గిపోలేదని.. ఆయన ఈ రంగంలోకి పునరాగమనం చేయబోతున్నాడని… తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా జనసేన తరఫున ప్రచారం చేయబోతున్నారని.. ఇలా రకరకాల ఊహాగానాలతో సాగుతున్నాయి ఈ చర్చలు, న్యూస్ స్టోరీలు. సినిమా కంటెంట్ గురించి తెలియకుండా ఈ డిస్కషన్లు ఏంటి అని కొందరు న్యూస్ ఛానెళ్లను విమర్శిస్తుంటే.. చిరు పేల్చిన చిన్న డైలాగ్ ఎంత సంచలనం అయిందంటూ మరికొందరు మెగా ఫ్యాన్స్ ఆయన్ని కొనియాడుతున్నారు.