‘‘అంటే అనిపించుకో.. గిల్లితే గిల్లించుకో.. కొడితే కొట్టించుకో.. అంతే తప్పించి..మాట్లాడే ప్రయత్నం చేయొద్దు.. మొత్తంగా నోరు మూసుకొని పడి ఉండు అంటే?’’ అంటే.. ఉండిపోవాల్సిందేనా? తాజాగా గన్నవరం విమానాశ్రయం వద్ద తన మాట కోసం గంటల తరబడి వెయిట్ చేస్తున్న మీడియా మిత్రులతో మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి నోటి నుంచి వచ్చిన మాటల్ని విన్నాక ఆశ్చర్యపోయే పరిస్థితి.
తెర మీద చీల్చి చెండాడే రీల్ స్టార్ కు.. నోటికి వచ్చినట్లు తనను ఈ స్థాయికి తెచ్చిన ఇండస్ట్రీని ఉద్దేశించి ‘బలిసిన’ మాటలు మాట్లాడిన వేళ.. ఆత్మగౌరవం కోసం రియాక్టు అయ్యే వారి నోళ్లను మూసేయాల్సిందిగా చిరు సవినయంగా కోరటమా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో తనకు లభించిన అపూర్వమైన గౌరవ మర్యాదల ప్రభావం చిరంజీవి మీద బాగానే ఉందన్న అభిప్రాయం తాజాగా ఆయన మాటల్ని విన్నప్పుడు కలుగుతుంది. నిజానికి యావత్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఉద్దేశించి.. వైసీపీ ఎమ్మెల్యే ఒకరు నోటికి వచ్చినట్లుగా మాట్లాడిన విషయం మీద ముఖ్యమంత్రి జగన్ ఎలా స్పందించారన్న విషయానికి సంబంధించి కించిత్ కూడా చెప్పకుండా.. ఏకపక్షంగా.. నేను వెళ్లి భోజనం చేసి వచ్చాను కదా.. మీరంతా ఇక మాట్లాడటం ఆపేయండన్న చిరు మాటల్ని చూసినప్పుడు.. ఆయన ఏ హక్కుతో ఈ సగౌరవ ఆదేశాల్ని రిక్వెస్టు రూపంలో జారీ చేస్తారన్నది అసలు ప్రశ్న.
తనకు తాను.. ఇండస్ట్రీకి పెద్దను కాదని తేల్చి చెప్పిన చిరంజీవి.. ఏ హోదాలో సినిమా ఇండస్ట్రీకి నోరు మూసుకొని ఉండాలన్న సూచన చేస్తారన్న సందేహానికి సమాధానం చెప్పేవారెవరు? ప్రభుత్వం మీద ఎవరూ కామెంట్లు చేయొద్దని చెబుతూ.. వారం పది రోజుల్లో జీవో వస్తుందని చెప్పిన చిరంజీవి మాటల్ని విన్నప్పుడు గతం ఒక్కసారి ప్లాష్ మాదిరి మెరవటం ఖాయం.
కొంతకాలం క్రితం టాలీవుడ్ ప్రముఖులు పలువురు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి.. ఆయనకు చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యల్ని తెలిపినప్పుడు..ముఖ్యమంత్రి తమ వినతులకు సానుకూలంగా స్పందించారని.. త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని చెప్పటం తెలిసిందే.
ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం వెలువడిందన్నది అందరికి తెలిసిందే. ఇక.. ఇటీవల కాలంలో కొడాలి నాని కావొచ్చు.. అనిల్ కావొచ్చు.. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కావొచ్చు.. సినిమా ఇండస్ట్రీ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో తెలిసిందే. అలాంటి వేళలో.. ఇలా మాటలు తూలటం ఏమాత్రం బాగోలేదన్న మాట చిరంజీవి నోటి నుంచి వచ్చింది లేదు.
తమను కించపరిచేలా మాటను అంటున్న వారిని ఉద్దేశించి.. ఒక్క మాట కూడా మాట్లాడని చిరంజీవి.. అందుకు భిన్నంగా ఆత్మాభిమానంతో రియాక్టు అవుతున్న వారిని మాట్లాడొద్దని చెప్పటం దేనికి సంకేతం? ఓపక్క పెద్దరికాన్ని తీసుకోనని చెబుతూనే.. మరోవైపు పెద్దరికం కోసం పాకులాడుతున్న మెగాస్టార్ వారి తీరు చూస్తే.. ఆయన ఇమేజ్ అంతకంతకూ డ్యామేజ్ కావటం తప్పించి మరింకేమీ కాదన్న విషయాన్ని మర్చిపోకూడదంటున్నారు. ఇంతకూ చిరంజీవి వారు కోరుకుంటున్నది ఏమిటి? గిల్లితే గిల్లించుకోవాలంతేగా? కానీ.. ఉప్పు..కారం తినే శరీరం.. గిల్లినప్పుడు నొప్పి కలగని రీతిలో మంత్రాన్ని జపించొచ్చు కదా చిరు?