మెగాస్టార్ చిరంజీవి మంచి నటుడు. ఏ రసాన్నయినా అలవోకగా పండిస్తారు. ఏ జానర్ సినిమాలోనైనా అదరగొడతాడు. ఐతే అభిమానుల వరకు ఆయన్నుంచి ఎక్కువగా ఆశించే విషయాలు మాత్రం.. డ్యాన్సులు, ఫైట్లు. తెలుగు సినీ చరిత్రలో నృత్యాలు, యాక్షన్ ఘట్టాల విషయంలో కొత్త ట్రెండ్ సృష్టించి.. ఇంకెవరికీ సాధ్యం కాని ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న ఘనుడు చిరు.
కేవలం ఆయన డ్యాన్సులు, ఫైట్లు చూడటానికే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేవాళ్లంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా చిరు లాంటి డ్యాన్సర్ ఇండియాలోనే లేడు అన్నా కూడా ఆ మాటకు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 80, 90 దశకాల్లో ఆయన డ్యాన్సులతో ఏ స్థాయిలో ఉర్రూతలూగించారో అప్పటి ప్రేక్షకులు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు.
ప్రతి సినిమాకూ నృత్యాలను సరికొత్తగా ఆవిష్కరిస్తూ.. అదిరిపోయే ట్రేడ్ మార్క్ స్టెప్పులతో ఆయన అలరించేవారు. ఆడియోలు విని ఆయా పాటలకు చిరు ఎలా డ్యాన్సులు చేసి ఉంటాడో అని ఊహించుకుని థియేటర్లకు వెళ్లేవారు ప్రేక్షకులు.
ఐతే రాజకీయాల కోసం సినిమాలకు టాటా చెప్పడానికి ముందు కొన్నేళ్లు చేసిన సినిమాల్లో చిరు తన స్థాయి స్టెప్పులు వేయలేదు. ఇక ఆ గ్యాప్ తర్వాత చేసిన రెండు చిత్రాల్లో ఒకటి డ్యాన్సులతో సంబంధం లేని సినిమా. ‘ఖైదీ నంబర్ 150’లో కొన్ని మంచి స్టెప్పులు వేశారు కానీ.. చిరు నుంచి ఇంకా స్టైలిష్ స్టెప్పులు ఆశించారు ఫ్యాన్స్.
ఐతే ఇప్పుడు ‘ఆచార్య’లో చిరు మార్కు డ్యాన్సులకు లోటు ఉండదనే అనిపిస్తోంది తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే. ఈ సినిమా నుంచి తొలి పాట ‘లాహె లాహె’ను మార్చి 31న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ఈ చిత్ర నిర్మాత, చిరు తనయుడు రామ్ చరణ్ వెల్లడించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ చూసి చిరు ఫ్యాన్స్ మైమరిచిపోతున్నారు.
తనదైన స్టైలిష్ పోజుతో అభిమానులను ఒకప్పటి రోజుల్లోకి తీసుకెళ్లిపోయాడు చిరు. వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. ‘ఆచార్య’లో చిరు డ్యాన్సులతో ఇరగదీయబోతున్నారనే అంచనాలు పెంచుకుంటున్నారు.