టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుల మధ్య ఇటీవల జరిగిన వివాదం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. హైదరాబాదులో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమం సందర్భంగా రేగిన వివాదం చినికిచినికి గాలివానగా మారింది. దీంతో, గరికపాటిని టార్గెట్ చేసిన మెగా అభిమానులు చిరంజీవికి ఆయన క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. అయితే, గరికపాటి పెద్దవారు ఆ విషయాన్ని వదిలేయండి అంటూ చిరంజీవి చెప్పడంతో మెగా ఫ్యాన్స్ కూడా శాంతించారు.
ఈ వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో గరికపాటిపై చిరంజీవి తాజాగా చేసిన పరోక్ష వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్ళిన చిరంజీవి ‘‘ఇక్కడ వారు లేరు కదా’’ అంటూ గరికపాటిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఆవిష్కరిస్తూ ‘‘శూన్యం నుంచి శిఖరాగ్రాలకు’’ అనే పుస్తకాన్ని సీనియర్ జర్నలిస్ట్ ప్రభు రచించారు.
ముఖ్య అతిథి చిరంజీవి చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. చిరంజీవి, మెగా ఫ్యామిలీకికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రభు ఈ పుస్తకం రాయడం విశేషం. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీనియర్ నటుడు, మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత మురళీమోహన్ తో పాటు టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు, ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నటుడు శివాజీ రాజా, ఉత్తేజ్ వంటి వారు అతిధులుగా హాజరయ్యారు.
అయితే, ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా చిరంజీవితో ఫోటోలు దిగేందుకు కొందరు మహిళలు వేదిక మీదకు వచ్చారు. ఈ సందర్భంగా ‘‘ఇక్కడ వారు లేరు కదా’’ అంటూ చిరు వేసిన పంచ్ డైలాగ్ స్టేజిపై నవ్వులు పూయించింది. గరికపాటిని ఉద్దేశించి పరోక్షంగా చిరంజీవి చేసిన చిరు కామెంట్ వైరల్ గా మారింది. చిరంజీవి ఆ మాట అనగానే స్టేజిపై ఉన్న మహిళలందరూ ఒక్కసారిగా నవ్వడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి, చిరంజీవి ఇండైరెక్ట్ కామెంట్స్ పై గరికపాటి స్పందిస్తారా లేదా సైలెంట్ గా ఉంటారా అన్నది వేచి చూడాలి.