రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ట్వీట్ చేశారు. తాను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నానని, కానీ రాజకీయం మాత్రం తన నుంచి దూరం కాలేదని వాఖ్యానించారు. ఈ మేరకు 10 సెకన్ల ఆడియో ఫైల్‌ను తన ట్విట్టర్ ఖాతాలో మెగాస్టార్ పోస్టు చేశారు.చిరంజీవి పెట్టిన ఈ ట్వీట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అయితే ఈ మాటలు తన తాజా చిత్రం గాడ్ ఫాదర్‌లోని డైలాగులని పలువురు భావిస్తుండగా.. మరోవైపు చిరు మాటలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
సినిమా టికెట్ల ధరల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సందర్భంలోనూ చిరంజీవి రాజకీయాలపై స్పష్టత ఇచ్చారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని పేర్కొన్నారు. మళ్లీ తాజాగా ట్విట్టర్ వేదికగా రాజకీయాలపై పోస్టు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పార్టీ లీగల్ సెల్ నేతలతో మాట్లాడుతూ.. చిరంజీవిని ఉద్దేశ పూర్వకంగా.. తొక్కేశారని.. ఆ పార్టీ ఉండి ఉంటే.. అధికారంలోకి వచ్చేదని అన్నారు.
దీనికి కొనసాగింపుగా.. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ ఫైర్ బ్రాండ్.. రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. చిరు రాజకీయాలు వేరని.. ఆయన కుటుంబంలో పుట్టి.. నువ్వు అమ్ముడు పోయావని.. తీవ్రంగా స్పందించారు. గతంలోనూ చిరును రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే చిరు తాజాగా ఈ ట్వీట్ చేసి ఉంటారని.. రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే.. మరోవైపు.. చిరు అభిమానులు మాత్రం.. ఇదంతా గాడ్ ఫాదర్ చిత్ర ప్రమోషన్ లో భాగంగానే చిరు ట్వీట్ చేసినట్లు తెలుస్తోందని అంటున్నారు. ఏదేమైనా.. చిరు వ్యాఖ్యలురెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చకు దారితీశాయి.