ఏపీలో జగన్ సర్కార్ కు మెగాస్టార్ చిరంజీవి మొదటి నుంచి అనుకూలంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయిన తర్వాత తాను నటించిన చిత్రం సైరా చూడాలంటూ సతీసమేతంగా సీఎంను కలిసిన చిరంజీవి, ఆ తర్వాత పలు సందర్భాలలో జగన్ కు పరోక్షంగా మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక, సినిమా టికెట్ల పెంపు విషయంలో అయితే జగన్ ముందు చిరంజీవి దాదాపు చేతులు కట్టుకున్నంత పరిస్థితి రావడం పై తమ్మారెడ్డి వంటి ఇండస్ట్రీ పెద్దలు కూడా పెదవి విరిచారు. ఇక, అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని మోడీతో చిరు, జగన్ కలిసి కరచాలనం చేసిన వైనం తెలిసిందే.
ఇలా దాదాపుగా వైసీపీ ప్రో అనే ముద్ర వేసుకున్న చిరంజీవి ఏనాడు ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదు.‘తమ్ముడు’ పవన్ రాజకీయం తమ్ముడిదే తన రాజకీయం తనదే అన్న రీతిలో చిరు ఉన్నారు. అయితే, ఇటువంటి నేపథ్యంలో చిరంజీవి తాజాగా జగన్ ప్రభుత్వం పై తొలిసారిగా పరోక్షంగా సంచలన విమర్శలు చేశారు. ‘‘మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి. పేదవారి కడుపు నింపే దిశగా ఆలోచించాలి. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటి’’ అని పరోక్షంగా ఏపీ ప్రభుత్వం, మంత్రి అంబటి రాంబాబుపై చిరంజీవి షాకింగ్ కామెంట్స్ చేశారు.
వాల్తేరు వీరయ్య 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపుతున్నాయి. ఇటీవల బ్రో చిత్రంలో బ్రో చిత్రం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్న మంత్రి అంబటి రాంబాబునుద్దేశించి పరోక్షంగా చిరంజీవి చురకలంటించారని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది. మరి, ఇప్పటివరకు చిరంజీవిని పల్లెత్తు మాట అనకుండా చిరంజీవి ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతున్న వైసీపీ నేతలు ఈ వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.
ఏదేమైనా మరికొద్ది నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో చిరంజీవి చేసిన ఇన్ డైరెక్ట్ పొలిటికల్ కామెంట్స్ ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి. చిరు తాజా కామెంట్లతో రాబోయే ఎన్నికలలో తమ్ముడు పవన్ కు అన్నయ్య చిరంజీవి బాసటగా నిలుస్తారని, అందుకే ఈ తరహా కామెంట్లు స్టార్ట్ చేశారని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది. ఒకవేళ అభిమానులు అనుకుంటున్నట్టుగానే పవన్ కు చిరంజీవి బహిరంగంగా మద్దతు పలికితే మాత్రం కచ్చితంగా ఏపీ రాజకీయాలలో పెను మార్పులు ఖాయమని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు.