అలయ్ బలయ్ కార్యక్రమం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాను ప్రసంగిస్తున్న సమయంలో అభిమానులతో చిరంజీవి ఫోటోలు దిగడంపై గరికపాటి అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, గరికపాటి అభ్యంతరం వ్యక్తం చేసిన వెంటనే చిరంజీవి ఫొటో సెషన్ ఆపేసి తన హుందాతనాన్ని చాటుకున్నారు.
ఈ క్రమంలోనే గరికపాటి కామెంట్లు మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. దీంతో, చిరంజీవికి గరికపాటి క్షమాపణలు చెప్పాలంటూ చిరంజీవి అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇక, గరికపాటిపై మెగా బ్రదర్ నాగబాబు పరోక్షంగా ట్వీట్ చేయడం కూడా దుమారం రేపింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై గరికపాటి స్పందించారు. రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు భవానీ కుమార్….గరికపాటితో ఫోన్లో మాట్లాడారు.
నిన్నటి ఘటనపై అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, వారిని సముదాయించామని గరికపాటికి భవానీ కుమార్ తెలిపారు. గరికపాటిని మెగా ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టారా అని భవానీ కుమార్ ప్రశ్నించారు. అయితే, తనను ఎవరూ ఇబ్బంది పెట్టలేదని గరికపాటి చెప్పారు. చిరంజీవి సహృదయుడని, ఈ విషయంపై నేరుగా చిరంజీవితో మాట్లాడతానని గరికపాటి వివరణ ఇచ్చారు.
అంతేకాదు, తాను చిరుతో మాట్లాడతానన్న విషయాన్ని అందరికీ చెప్పాలని గరికపాటి అన్నారు. ఈరోజు చిరంజీవితో తప్పకుండా మాట్లాడతానని చెప్పారు. ఈ క్రమంలోనే గరికపాటి నరసింహారావుతో భవానీ కుమార్ ఫోన్ మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గరికపాటి నరసింహారావు గారితో ఫోన్ లో మాట్లాడిన రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు భవానీ రవికుమార్ గారు ..@KChiruTweets@PawanKalyan pic.twitter.com/aFVERI3Q2q
— Prasannakumar Nalle (@PrasannaNalle) October 7, 2022