‘లాల్ సింగ్ చడ్డా’ చిత్ర ప్రమోషన్ సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. టాలీవుడ్ దర్శకుల పనితీరుపై చిరు సున్నితమైన రీతిలో విమర్శనాత్మకంగా స్పందించడం ఇపుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఓ సినిమా స్క్రిప్టును ఆ సినిమాలోని అందరు నటీనటులకు, టెక్నీషియన్లకు తెలియజేస్తే వచ్చే ఫలితాలు మరో స్థాయిలో ఉంటాయని చిరు అభిప్రాయపడ్డారు.
అయితే, టాలీవుడ్ లో అలా జరగడం లేదని తెలుగు దర్శకులను చిరు సున్నితంగా విమర్శించారు. స్క్రిప్టుపై పూర్తి అవగాహన ఉంటే నటీనటులు, నిపుణులు పూర్తిస్థాయిలో తమ పనిపై దృష్టి పెట్టే వీలుంటుందని, అది కచ్చితంగా సినిమా ఔట్ పుట్ పై ప్రభావం చూపుతుందని అన్నారు. ఆమిర్ ఖాన్ వంటి వాళ్లు ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారని, దీన్ని మనవాళ్లు కూడా అనుసరించాలని సూచించారు. మన దర్శకులు కూడా ఆ తరహా వర్క్ షాపులను నిర్వహించే పద్ధతిని అందిపుచ్చుకోవాలని చిరంజీవి సూచించారు.
“ఇప్పుడేమవుతోందంటే… మెయిన్ హీరోకు మాత్రం కొంతవరకు స్క్రిప్టు గురించి తెలుసుంటుంది. ఆ సినిమాలోని ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులకు గానీ, కమెడియన్స్ కు గానీ స్క్రిప్టు తెలియదు. వాళ్లు సెట్స్ మీదకు వచ్చి అప్పటికప్పుడు దర్శకుడు ఏంచెబుతాడో అదే చేస్తారు. దాంతో నటీనటుల ఇన్వాల్వ్ మెంట్ అంతవరకే ఉంటుంది. కానీ, ఇది సరికాదు. ఓ సినిమాకు సంబంధించి స్క్రిప్టును దర్శకుడు ముందే ఖరారు చేసుకోవాలి.
డైలాగులను నటీనటులతో సాధన చేయించేందుకు వర్క్ షాపులు నిర్వహించాలి. ఓ గదిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి అందరూ కూర్చుని సీన్ల గురించి చర్చించాలి. అక్కడ్నించి సెట్స్ మీదకు వెళ్లిన నటుడు తన డైలాగ్ ఏంటన్నదానిపై మనసు పెట్టక్కర్లేదు… పెర్ఫార్మెన్స్ పై మనసు పెడితే చాలు. డైలాగ్ ఏంటన్నది వారు అప్పటికే నేర్చుకుని ఉంటారు కాబట్టి నటనపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించగలరు. తద్వారా వారు తమ అత్యుత్తమ నటన కనబర్చగలరు.’’అని చిరు అన్నారు.
దీంతో, చిరు వ్యాఖ్యలపై ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిరు వంటి పెద్ద హీరోలకు షూటింగ్ మొదలవడానికి ముందే స్క్రిప్టు, డైలాగులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయని, కానీ, చిన్న హీరోలు, సినిమాల విషయంలో అందరికీ స్క్రిప్ట్, డైలాగులు అందకపోవచ్చని అంటున్నారు. ఏది ఏమైనా టాలీవుడ్ దర్శకులపై చిరు విమర్శలు…వైరల్ అయ్యాయి.