‘అందమైన ఊహకు పొందికైన రూపం’ అన్న ట్యాగ్ తో తెలుగు ప్రజలకు సుపరిచితం శుభగ్రహ హౌసింగ్. మిగిలిన సందర్భాల్లో అయితే.. ఈ సంస్థ గురించి వార్త రాయాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ.. ఆ సంస్థ తాజాగా విడుదల చేసిన ఒక వ్యాపార ప్రకటన యూట్యూబ్ లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ ఒక వార్తగా మారింది. అన్నింటికి మించిన ఈ యాడ్ లో మెగాస్టార్ చిరంజీవి.. యాంకర్ అనసూయ.. సీనియర్ నటి ఖుష్భూ తో చేసిన ఈ యాడ్ నిడివి నిమిషమే అయినా.. ట్విస్టుల మీద ట్విస్టులతో అదరగొట్టేసింది.
చిరు వయసును పాతికేళ్లు తగ్గించేలా ఉన్న ఈ యాడ్ పుణ్యమా అని.. వ్యాపార ప్రకటనల్లోచిరును ఎంతలా వాడేయొచ్చో ఈ ప్రకటన చెప్పేసింది. అంతేనా.. యాంకర్ అనసూయ గ్లామర్ ను మరింత ఎలివేట్ చేసేలా ఉన్న ఈ యాడ్ లో ఖుష్భూ తళుక్కున మెరిసారనే చెప్పాలి. అందమైన ఊహకు పొందికైన రూపం అన్న ట్యాగ్ లైన్ కు తగ్గట్లే.. ఒక చిన్న కాన్సెప్టుతోడిజైన్ చేసిన ఈ యాడ్ ఆకట్టుకునేలా ఉంది. భార్యకు తెలీకుండా ఒక మధ్యతరగతి భర్త.. ఇంటిని ప్లాన్ చేయటం.. దాన్ని ఆమెకు గిఫ్టుగా ఇవ్వాలనే ప్రయత్నంలో భార్య తప్పుగా అర్థం చేసుకోవటం.. దీనికి అనసూయ పాత్రధారి కారణం కావటం లాంటి అంశాలతో తయారు చేసిన ఈ వ్యాపార ప్రకటన మనసును దోచుకునేలా ఉంది.
దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ యాడ్ కు భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకు వెండితెర మీద కుదరని ఈ కాంబినేషన్.. ఒక వ్యాపార ప్రకటన కోసం తయారు చేసిన బుల్లి ఫిలింలో సాధ్యం కావటం.. ఈ ప్రకటనను చూసిన వారంతా వావ్ అనుకోకుండా ఉండలేరు. ఇక.. ఈ యాడ్ గురించి చిరు ఇప్పటికే ట్విటర్ లో పేర్కొంటూ.. సుకుమార్ డైరెక్షన్ ను తాను చాలా ఎంజాయ్ చేసినట్లుగా చెప్పటం తెలిసిందే. ఏమైనా.. నిమిషం నిడివి ఉన్నయాడ్ లో ముగ్గురి ఎమోషన్ ను చక్కగా ఎలివేట్ అయ్యేలా చూపించటంలో మాత్రం సుకుమార్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. దీనికి నిదర్శనంగా యాడ్ విడుదల చేసిన గంటల వ్యవధిలో ఇప్పటికే 16 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకోవటం గమనార్హం.