కరోనా దెబ్బకు లాక్ డౌన్ అమల్లోకి వచ్చాక ఉపాధి కోల్పోయి అవస్థలు పడ్డ సినీ కార్మికులను ఆదుకోవడానికి ముందుకొచ్చి సహాయ కార్యక్రమాలను గొప్పగా, ముందుండి నడిపించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. కరోనా క్రైసిస్ చారిటీ సంస్థ చిరు ఆధ్వర్యంలోనే ఏర్పాటైంది. దీనికి తన వంతుగా ముందు భారీ విరాళం ప్రకటించిన చిరంజీవి.. సినీ పరిశ్రమలో కదలిక తెచ్చారు.
తర్వాత అందరూ ఆయన అడుగుజాడల్లో నడిచారు. ఇందుకోసం పరిశ్రమ తరఫున ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆరు నెలలుగా సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాడు చిరు. దీనికి తోడు కరోనా మీద అవగాహన కల్పించేందుకు తన వంతుగా గట్టి ప్రయత్నమే చేశాడు చిరు. ప్లాస్మా దానం మీద పోలీసులతో కలిసి అవగాహన కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. జనాల్లో స్ఫూర్తి నింపి ఆ దిశగా నడిపించారు. ఇక కరోనా టైంలో రక్తం కొరత ఏర్పడితే.. స్వయంగా రక్తదానం చేయడంతో పాటు ఈ సమయంలో రక్తం ఆవశ్యకతను తెలియజెప్పి తన బ్లడ్ బ్యాంకుకు వచ్చి మరింత మంది రక్తదానం చేసేలా చూశారు చిరు.
ఇప్పుడు చిరు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన బ్లడ్ బ్యాంక్ ద్వారా పేద రోగులకు ఉచితంగా ప్లాస్మా దానం చేయడానికి ముందుకొచ్చాడు చిరు. కరోనా చికిత్సలో ప్లాస్మా అత్యంత కీలకంగా మారడం, దానికి అత్యంత డిమాండ్ నెలకొన్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకుని యాంటీ బాడీస్ తయారైన వాళ్లు ప్లాస్మా దానం చేయొచ్చు. ఐతే దీనిపై ఎంతగా అవగాహన కల్పించినప్పటికీ జనాల్లో ఇప్పటికీ కొన్ని అనుమానాలు నెలకొన్నాయి. దీంతో సరిపడా ప్లాస్మా లేక రోగులకు ఇబ్బంది తలెత్తుతోంది.
ఈ నేపథ్యంలో ప్లాస్మా కోసం భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితీ నెలకొంటోంది. ఇలాంటి సమయంలో తెల్ల రేషన్ కార్డున్న వాళ్లెవరైనా కరోనా బారిన పడి వారికి ప్లాస్మా అవసరమైతే.. కార్డు చూపించి తమ బ్లడ్ బ్యాంకులో ఉచితంగా ప్లాస్మా తీసుకునే సౌలభ్యం కల్పించారు చిరు. దీనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.