ఏపీ సీఎం జగన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిల మధ్య సత్సంబంధాలున్న సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయిన తర్వాత చిరు రెండు, మూడు సార్లు జగన్ తో భేటీ అయ్యారు. ఇండస్ట్రీ పెద్దగా అనధికారిక హోదాలో చిరు కూడా పలు సమస్యలపై జగన్ తో చర్చించినట్లు గతంలో ప్రచారం జరిగింది. అయితే, సినిమా టికెట్ల వ్యవహారం దుమారం రేగిన తర్వాత మాత్రం తాను ఇండస్ట్రీ పెద్దను కానంటూ చిరు ఇచ్చిన స్టేట్ మెంట్ కొత్త చర్చకు దారి తీసింది.
దీంతో టికెట్ రేట్ల వ్యవహారంలో జగన్ కు చిరుకు మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని, అందుకే ఇంత బర్నింగ్ టాపిక్ పై మాట్లాడకుండా చిరు సైలెంట్ అయ్యారని టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా జగన్ తో భేటీ అయ్యేందుకు చిరు తాజాగా తాడేపల్లికి రావడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్న చిరును గన్నవరం విమానాశ్రయం వద్ద మీడియా పలకరించగా ఆసక్తికర సమాధానమిచ్చారు.
తాను జగన్ ఆహ్వానం ప్రకారం ఇండస్ట్రీ బిడ్డగా వచ్చానని, సీఎంతో అన్ని విషయాలపై చర్చిస్తానని తెలిపారు. జగన్ తో లంచ్ చేసి, ఆ తర్వాత చర్చించి మరో గంటన్నరలో అన్ని అంశాలపై క్లారిటీ ఇస్తానని చిరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జగన్ తో భేటీ అయిన చిరు ఏం మాట్లాడబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. మరి, చిరు లోపల ఏం మాట్లాడారో బయటకు వెల్లడిస్తారా…లేక సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేందుకు మర్యాదపూర్వకంగా కలిశానని సైలెంట్ అవుతారా అన్నదానిపై ఉత్కంఠ ఏర్పడింది.