మెగాస్టార్ చిరంజీవికి లీక్ మాస్టర్ అని పేరుంది. తాను చేస్తున్న సినిమాలకు సంబంధించి విశేషాలను లీక్ చేసేయడం చిరు కు అలవాటు. ‘ఆచార్య’ సినిమా పేరును అనుకోకుండా వేరే చిత్రానికి సంబంధించిన వేడుకలో ఆయన వెల్లడించేసి నాలుక్కరుచుకోవడం గుర్తుండే ఉంటుంది. దీని మీద ‘ఆచార్య’ టీం అప్పట్లో ఒక మీమ్ కూడా తయారు చేసింది. దీన్ని సరదాగా తీసుకున్న చిరు.. ఇలా తన సినిమాల విశేషాలను లీక్ చేసే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. తనకు తానుగా ‘చిరు లీక్స్’ హ్యాష్ ట్యాగ్ కూడా వాడుతున్నారు.
తాజాగా ఆయన ‘భోళా శంకర్’ ఆన్ లొకేషన్ పిక్స్ కొన్ని ట్విట్టర్లో వదిలారు. ఈ సినిమాలో ఒక పాట చిత్రీకరణ కోసం హీరో హీరోయిన్లు చిరు, తమన్నాలతో పాటు టీం అంతా స్విట్జర్జాండ్కు వెళ్లింది. అక్కడ అందమైన, ఆహ్లాదకరమైన లొకేషన్లో షూట్ జరుగుతుండగా.. షాట్ గ్యాప్లో తీసిన ఫొటోలను చిరు ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నారు.
ఇందులో కుర్చీలో కూర్చున్న చిరు డ్రింక్ తాగుతూ కనిపిస్తున్నారు. లుక్ రివీల్ కాకుండా ఫొటోలు వెనుక నుంచి తీశారు. చిత్రాల్లో డ్యాన్సర్లు, టెక్నికల్ టీం కనిపిస్తోంది. ఈ ఫొటోలను షేర్ చేస్తూ.. ‘‘స్విట్జర్లాండ్లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్లలో భోళా శంకర్ కోసం తమన్నాతో ఆట పాట (SONG SHOOT) ఎంతో ఆహ్లాదంగా జరిగింది. ఈ పాట ప్రేక్షకులందరినీ, మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను. త్వరలోనే మరిన్ని సంగతలు పంచుకుందాం. అప్పటి వరకు ఈ ‘చిరు లీక్స్’ పిక్స్’’ అంటూ ఫన్ ఎమోజీ జోడించారు చిరు.
మెగాస్టార్ తనకు తానుగా ఇలా ‘చిరు లీక్స్’ అని పేర్కొంటూ ఫొటోలు షేర్ చేయడం పట్ల నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. ఇక తన ట్వీట్లో తమన్నాతో ఆటా పాట అని పేర్కొని బ్రాకెట్లో SONG SHOOT అని పేర్కొనడం కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. తమన్నాతో ఆటా పాటా అంటే సోషల్ మీడియా జనాలు వేరే అర్థాలు తీసుకుని వివాదం చేస్తారేమో అని SONG SHOOT అని పర్టికులర్గా చిరు పేర్కొన్నట్లుగా కనిపిస్తోంది.