‘‘నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను.. కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు’’ అంటూ మాజీ రాజ్యసభ్య సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రం విడుదలకు ముందు చేసిన ట్వీట్ ఇరు తెలుగు రాష్ట్రాలలో జాతీయ రాజకీయలలోనూ ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఆ ట్వీట్ చేసిన మరుసటి రోజే చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఐడీని విడుదల చేయడం, కోవూరు నుంచి చిరంజీవిని ప్రతినిధిగా పేర్కొంటూ 2027 వరకు డెలిగేట్ ఐడీని కాంగ్రెస్ పార్టీ జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఓ పక్క జగన్, మరో పక్క మోడీతో సత్సంబంధాలు నెరుపుతున్న చిరు…ఏ పార్టీలోనూ లేనంటూ సైలెంట్ గా ఉంటున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయని చిరు ఇంకా టెక్నికల్ గా ఆ పార్టీలోనే ఉన్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కానీ, చిరు మాత్రం తాను ప్రత్యక్ష రాజకీయాల్లో లేనని చాలా సార్లు ప్రకటించారు. కానీ, ఇటీవల పవన్ ను ఉద్దేశించి చిరు అంటోన్న మాటలు చూస్తుంటే 2024 ఎన్నికలలో ఏదో ఒక పార్టీ తరఫున చిరు ప్రచారం చేసే చాన్స్ ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవి తమ పార్టీ వాడేనంటూ కాంగ్రెస్ మరోసారి షాక్ ఇచ్చింది. చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో చిరుకు ఇంకా మంచి సంబంధాలు ఉన్నాయని, అవి కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని చెప్పుకొచ్చారు.
ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోబోమని అన్నారు. రాబోయే ఎన్నికల కోసం జిల్లా కమిటీలు నాయకులు సిద్ధం చేసేందుకు జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో జగన్ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని గిడుగు విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో రేప్ లు, అక్రమాలు పెరిగిపోయాయని చెప్పారు.