మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివల కాంబినేషన్ లో రాబోతోన్న ‘ఆచార్య’ చిత్రంపై టాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ మొదలెపెట్టిన చిరు వరుస హిట్లతో దూసుకుపోతుండగా….కొరటాల శివ తన మార్క్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. దీంతో, వీరిద్దరి కాంబోలో రాబోతోన్న ‘ఆచార్య’ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని మెగా హీరో రామ్ చరణ్ నిర్మిస్తుండడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
సందేశాత్మక చిత్రాలతో కమర్షియల్ హిట్ లు కొట్టడంలో ఆరితేరిన కొరటాల, హిట్ సినిమాలకు కేరాఫ్ అయిన చిరుల కాంబోలో హిట్ ఖాయమని చిరు ఫ్యాన్స్ కాకాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ నెల 29న చిత్రం విడుదల సందర్భంగా ఆచార్య టీం ప్రమోషన్స్ జోరు పెంచింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఉత్తరాదిలో కపూర్ ఫ్యామిలీ తరహాలో దక్షిణాదిలో తన కుటుంబం కపూర్ ఫ్యామిలీ కావాలనుకున్నానని చిరు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.
బాలీవుడ్ లో రాజ్ కపూర్ వారసత్వాన్ని రణ్ బీర్ కపూర్ వరకు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అదే తరహాలో తన ఫ్యామిలీకి గుర్తింపు రావాలన్నది చిరు కోరికట. హిందీలో కపూర్ ఫ్యామిలీకి ఓ ప్రాధాన్యత ఉందని, ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్లంతా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారని చిరు అన్నారు. వారికున్న పేరు, ఫేమ్ ను చూసి తనకెంతో ముచ్చటేసిందని, అందుకే తన కుటుంబం కపూర్ ఫ్యామిలీలా ఎదగాలనుకుంటున్నట్టు పవన్ తో చెప్పానని చిరు గుర్తు చేసుకున్నారు.
పవన్ నుంచి అల్లు అర్జున్ వరకు తన ఫ్యామిలీ నుంచి వచ్చిన వారంతా హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని, కెరీర్ లో ఎత్తుపల్లాలతో తమకంటూ సొంత స్టార్ స్టేటస్ ను తెచ్చుకున్నారని చిరు ఆనందం వ్యక్తం చేశారు. ఇక, తన తనయుడు చరణ్ తో స్క్రీన్ పంచుకోవడం ఎంతో సంతోంగా ఉందని, ‘ఆచార్య’ తన కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చారు చిరంజీవి.