కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్త దక్షిణాది చిత్ర పరిశ్రమతో పాటు యావత్ సినీ ప్రపంచాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. పునీత్ హఠాన్మరణంతో కన్నడ సినీ పరిశ్రమ, పునీత్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు పునీత్ కు నివాళులర్పించారు. తాజాగా ఈ రోజు పునీత్ కు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, జూ.ఎన్టీఆర్, శ్రీకాంత్, దగ్గుబాటి రానా తదితరులు నివాళులర్పించారు.
బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉన్న పునీత్ పార్థీవ దేహానికి బాలకృష్ణ నివాళులర్పించారు. పునీత్ రాజ్‌కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ ను పరామర్శించి ఓదార్చిన బాలయ్య ఎమోషనల్ అయ్యారు. పునీత్ మన మధ్య లేడన్న వార్తను నమ్మలేకపోతున్నాని, వ్యక్తిగతంగా పునీత్ మరణం తనకు తీరని లోటని బాలయ్య భావోద్వేగానికి లోనయ్యారు. రాజ్‌కుమార్ కుటుంబంతో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని, తామంతా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవారమని గుర్తు చేసుకున్నారు.
హరికృష్ణ మరణం తర్వాత బాలయ్య…తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టిన సందర్భం ఇదే. హరికృష్ణ మరణంతో బాలయ్య కుంగిపోయిన సంగతి తెలిసిందే. శివరాజ్ తర్వాత బాలయ్య తనకు అన్నయ్య అని చెప్పారని, ఏదో ఫంక్షన్లో తన చెంపమీద ఏదో పడితే పునీత్ క్లీన్ చేశాడని బాలయ్య గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్స్‌కి కూడా పునీత్ వచ్చాడని గుర్తు చేసుకున్నారు. పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నట్టు బాలయ్య చెప్పారు.
పునీత్ తో జూనియర్ ఎన్టీఆర్ కు కూడా మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే పునీత్ పార్థీవ దేహాన్ని సందర్శించిన తారక్… కన్నీరుమున్నీరయ్యారు. పునీత్ సోదరుడు శివరాజ్‌కుమార్‌ను హత్తుకుని ఓదార్చారు. మరోవైపు, చిరంజీవి, వెంకటేష్, శ్రీకాంత్, అలీ, రానాలు కూడా పునీత్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. శివరాజ్ కుమార్ ను హత్తుకున్న చిరు, వెంకటేష్, శ్రీకాంత్ లు ఆయనకు ధైర్యం చెప్పారు. కాగా, అమెరికా నుంచి పునీత్ కూతురు రాక ఆలస్యం కావడంతో అంత్యక్రియలు రేపటికి వాయిదా పడ్డాయి.