మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు లైన్లో పెట్టేస్తున్నారు. ప్రస్తుతం నటిస్తున్న ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ కాకుండా ఆయన ఇంకో రెండు చిత్రాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి ‘భోళా శంకర్’ కాగా.. ఇంకోటి కె.ఎస్.రవీంద్ర (బాబీ) డైరెక్ట్ చేయనున్న చిత్రం.
ఈ సినిమా స్క్రిప్టు మీద బాబీ దాదాపు రెండేళ్లుగా పని చేస్తున్నాడు. మెగాస్టార్‌కు వీరాభిమాని అయిన బాబీ.. ఒక అభిమాని తన ఆరాధ్య కథానాయకుడిని ఎలా చూడాలనుకుంటాడో అలా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లుగా ముందు నుంచి చెబుతూ వస్తున్నాడు.
మొన్న చిరంజీవి పుట్టిన రోజు కానుకగా రిలీజైన ప్రి లుక్ చూస్తే బాబీ మాటలు నిజమే అనిపించింది. వింటేజ్ మెగాస్టార్ కనిపించాడు అందులో. చిరంజీవి కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ ‘ముఠామేస్త్రి’ లుక్‌ను గుర్తుకు తెచ్చింది ప్రి లుక్ పోస్టర్.
ఈ చిత్రం విశాఖపట్నం పోర్టు నేపథ్యంలో నడిచే కథతో తెరకెక్కుతుందని.. చిరు పోర్టులో పని చేసే కూలీలకు మేస్త్రిగా కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ కూడా కొన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడీ టైటిల్ మార్చినట్లు తెలుస్తోంది.
చిరంజీవి పేరును వీరయ్య అని కాకుండా శీనుగా మార్చారట. వీరయ్య అంటే మరీ మాస్‌గా, పాతగా ఉంటుందని.. అందుకే శీను అనే పేరు పెట్టారని సమాచారం. ‘వాల్తేరు శీను’ అనే టైటిల్‌నే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది. ‘గాడ్ ఫాదర్’ పూర్తి చేశాక ‘భోళా శంకర్’ను మొదలుపెట్టి.. మరి కొన్ని రోజులకు బాబీ సినిమాను పట్టాలెక్కించనున్నాడట చిరు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఖరారయ్యాడు. ఈ సినిమాకు మరింతమంది పేరున్న టెక్నీషియన్లు పని చేయబోతున్నారు.