మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రంపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’తో నిరాశపరిచిన చిరు…ఈ చిత్రంతో బంపర్ హిట్ కొడతాడని మెగా ఫ్యాన్స్ అంతా గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రమోషన్లలో జోరు లేదని విమర్శలు రావడంతో…ఇటీవల తార్ మార్ తక్కర్ మార్ లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. లేటుగా లేటెస్టుగా వచ్చిన ఆ పాట…ఆ విమర్శలన్ని మరచిపోయేలా చేసింది.
ఇక, మెగా అంచనాలకు తగ్గట్లుగా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో చిరుతోపాటు చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ లో దూకుడు పెంచింది. ఈ చిత్ర ప్రమోషన్ లలో భాగంగానే చిరంజీవిని యాంకర్ శ్రీముఖి ఓ చార్టర్డ్ ప్లేన్ లో ఇంటర్వ్యూ చేసింది. తాజాగా దానికి సంబంధించిన ప్రోమో ఆకట్టుకుంటోంది. ఈ ప్రోమోలో చిత్రానికి సంబంధించిన కీలక విషయాలను చిరు స్వయంగా వెల్లడించారు.
గాడ్ ఫాదర్ ఒక నిశ్శబ్ద విస్ఫోటనం అంటూ ఒక్క ముక్కలో తేల్చేశారు చిరు. హీరోయిన్లు, పాటలు లేవన్న ఆలోచన రానివ్వకుండా ఈ సినిమా సబ్జెక్ట్ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక, అడిగిన వెంటనే చిన్న పాత్రకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఎంతో ప్రేమతో ఈ సినిమా చేయడానికి అంగీకరించాడని, హ్యాట్సాఫ్ టు సల్మాన్ భాయ్… వుయ్ లవ్యూ అంటూ సల్మాన్ ను ప్రశంసించారు చిరు.
ఇక, ఈ సినిమాలో జర్నలిస్టు పాత్రలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కనిపించబోతున్నాడట. అయితే, ఆ పాత్ర చేసేందుకు పూరీ జగన్నాథ్ మొదట అంగీకరించలేదట. కానీ, ఈ సినిమా చూసి తర్వాత పూరీలో మంచి నటుడున్నాడని మీరే ఆశ్చర్యపోతారని చిరు చెప్పారు. ఈ సినిమాకు తమన్ ఆరో ప్రాణమని, 100 శాతం కంటే ఎక్కువ ఔట్ పుట్ ఇచ్చాడని అన్నారు. అయితే, చిరు చెప్పిన మాటలనుబట్టి ఈ సినిమాలో తార్ మార్ పాట మినహాయించి..మరే పాట ఉన్నట్లు లేదు. ముఖ్యంగా చిరుకు హీరోయిన్ తో స్టెప్పులేసే చాన్స్ లేనట్లు కనిపిస్తోంది. దీంతో, తాజాగా ఈ ప్రోమోతో ఫ్యాన్స్ కు చిరు షాకిచ్చినట్లయింది.