టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన అనుష్క శెట్టి, యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పొలిశెట్టిల కాంబోలో రాబోతున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. మహేశ్ బాబు పచ్చిగొల్ల తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ చిత్ర ప్రమోషన్స్ బాధ్యత మొత్తం నవీన్ తన భుజాలపై మోస్తున్నాడు. కాలేజీలు, మాల్స్ ఇలా అవకాశం ఉన్న ప్రతి చోట సోలో ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు. కారణాలేమైనా, అనుష్క ప్రమోషన్లకు రావడం లేదు. దీంతో, ఈ చిత్రంపై అనుకున్నంత బజ్ రాలేదని టాక్ ఉంది.
ఈ క్రమంలోనే ఈ చిత్ర యూనిట్ కు బూస్ట్ నిచ్చేలా ఈ చిత్ర ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అది కూడా టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి దగ్గర నుంచి కావడంతో చిత్ర యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. ఈ చిత్ర స్పెషల్ ప్రీమియర్ చేసిన చిరంజీవి తన అభిప్రాయాలను ‘ఎక్స్'(గతంలో ట్విటర్) లో షేర్ చేశారు. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు తనను ఎంతగానో ఆకట్టుకుందని, కడుపుబ్బా నవ్వించే వినోదభరిత చిత్రం అని చిరు కితాబిచ్చారు. ఈ కాలపు యువత ఆలోచనా తీరుకు అద్దంపట్టే చిత్రం ఇదని, సరికొత్త కథాంశంతో రూపొందించారని కొనియాడారు.
‘జాతిరత్నాలు’ చిత్రానికి రెట్టింపు ఎనర్జీని, వినోదాన్ని నవీన్ పొలిశెట్టి అందించాడని, కొంచెం గ్యాప్ తర్వాత దేవసేన మరింత అందంగా కనిపించి ఈ చిత్రానికి ప్రాణం పోసిందని కితాబిచ్చారు. పూర్తిస్థాయి ఎంటర్టయినర్ గా భావోద్వేగాలను కూడా మిక్స్ చేసిన చిత్రం ఇదని చిరు ప్రశంసించారు. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మహేశ్ బాబును అభినందించారు చిరు. ఈ చిత్రానికి తానే తొలి ప్రేక్షకుడినని, ఆ హిలేరియస్ మూమెంట్స్ ను ఎంతో ఆస్వాదించానని చిరు చెప్పారు. ఈ సందర్భంగా నవీన్ తో, చిత్ర యూనిట్ తో కలిసి దిగిన ఫొటోలను చిరు షేర్ చేశారు.