అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం హైదరాబాదులో అల్లు స్టూడియోస్ ను నిర్మించారు. ఈ క్రమంలోనే అల్లు స్టూడియోస్ ను మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరు అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నానని చెప్పారు. ఈరోజు అల్లు అరవింద్, బన్నీ, శిరీష్, బాబిలు సినీ రంగంలో ఉన్నత స్థానాలు అందుకోవడానికి అల్లు రామలింగయ్య కారణమని చిరు అన్నారు.
దశాబ్దాల క్రితం అల్లు రామలింగయ్య మదిలో నిలిచిన ఒక చిన్న ఆలోచన ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థగా మారిందని చెప్పారు. అందుకే అల్లు వారసులు ప్రతిక్షణం అల్లు రామలింగయ్యను తలుచుకుంటూ ఉండాలని అన్నారు. ఇక, అల్లు కుటుంబంలో తాను కూడా భాగం కావడం తన అదృష్టమని చిరు అన్నారు. అల్లు స్టూడియో అనేది ఒక స్టేటస్ సింబల్ అని, అల్లు అనే బ్రాండ్ తో అల్లు రామలింగయ్యను తరతరాలు గుర్తుంచుకునేలా స్టూడియోను నిర్మించారని చిరు కొనియాడారు.
మరోవైపు, ‘గాడ్ ఫాదర్’ ప్రమోషన్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి చిరు షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజమౌళి అత్యంత ప్రతిభ కలిగిన దర్శకుడు అని, భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి అని చిరు కొనియాడారు. మిస్టర్ పర్ఫెక్ట్ డైరెక్టర్ అయిన రాజమౌళి బెస్ట్ అవుట్ ఫుట్ కోరుకుంటారని, అయితే రాజమౌళి కోరుకునే బెస్ట్ అవుట్ పుట్ ను ఒక నటుడిగా తాను ఇవ్వగలనో లేదో తనకు తెలియదని చిరు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక, రాజమౌళి ఒక్కో సినిమాకు మూడు నుంచి ఐదు సంవత్సరాలు తీసుకుంటారని, అంత సమయాన్ని తాను ఇవ్వలేనేమోనని చిరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం తాను ఏకకాలంలో నాలుగు సినిమాలు షూటింగ్ చేస్తున్నాను అని చెప్పారు. అందుకే, రాజమౌళితో సినిమా చేయాలని గానీ, పాన్ ఇండియా రేంజ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనిగానీ తనకు లేదని చిరు అన్నారు. అయితే, ఏనాటికైనా ఒక సినిమాకు దర్శకత్వం వహించాలన్న కోరిక తనకు ఉందని మనసులో మాట బయటపెట్టారు చిరు.