అలయ్ బలయ్ కార్యక్రమం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. చిరంజీవి ఫోటోషూట్ ఆపేస్తేనే తాను ప్రసంగం కొనసాగిస్తానని లేకుంటే అక్కడ నుంచి వెళ్లిపోతానని గరికపాటి అసహనం వ్యక్తం చేయడం మెగా ఫాన్స్ కు ఆగ్రహం తెప్పించింది. అయితే విషయంపై ఎటువంటి కామెంట్లు చేయని చిరు..ఫొటో షూట్ ఆపేసి గరికపాటి పక్కనే కూర్చున్నారు.
చిరు హుందాగా వ్యవహరించారని, గరికపాటి ఆయనకు క్షమాపణ చెప్పాల్సిందేనని మెగా ఫ్యాన్స్ పట్టుబట్టారు. నాగబాబు తో పాటు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మెగా అభిమానులు కూడా గరికపాటిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. చిరంజీవికి గరికపాటి ఫోన్ చేసి మాట్లాడాలని కోరుతూ గరికపాటితో మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భవాని శంకర్ ఫోన్లో మాట్లాడిన వీడియో కూడా బయటకు వచ్చింది.
దీంతో, చిరంజీవికి గరికపాటి ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారని కూడా కొన్నిచోట్ల ప్రచారం జరిగింది. కానీ దాని గురించి అధికారిక ప్రకటన అది వెలువలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు ఈ వివాదం స్పందించని చిరంజీవి తాజాగా నోరు విప్పారు. ‘‘గరికపాటి పెద్దాయన…గొప్పవారు..ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు’’ అని చిరు చేసిన తాజా కామెంట్లు వైరల్ గా మారాయి. గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి స్వయంగా ఈ వ్యవహారంపై చర్చించాల్సిన అవసరం లేదని చెప్పారు.
అయితే చిరు ఇలా చెప్పడాన్ని మెగా ఫాన్స్ రిసీవ్ చేసుకుంటారా? గరికపాటిపై ట్రోలింగ్ ఆపి ఈ గొడవకు పుల్ స్టాప్ పెడతారా? లేదా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా ఈ వివాదానికి ముగింపు పలికేందుకు చిరంజీవి చొరవ తీసుకోవడంతో మరోసారి ఆయనకు హందాతనం బయటపడిందని మెగా అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆరోజు స్టేజిపై అయినా ఈరోజు స్టేజిపై అయినా చిరంజీవి పెద్దమనిషిలాగా వ్యవహరించి ఎందరికో ఆదర్శప్రాయంగా మారారని అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు.