ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ గా అత్యంత ఆసక్తి రేపుతున్న నియోజకవర్గాలలో ఏలూరు జిల్లాలోని దెందులూరు ఒకటి. దెందులూరు పేరు చెబితేనే గత 20 సంవత్సరాలుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ చింతమనేని ప్రభాకర్ రావు పేరు వినిపిస్తోంది. 2009, 2014 ఎన్నికలలో వరుసగా గెలిచిన చింతమనేని 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ వేవ్‌లో ఓడిపోయారు. చింతమనేని ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ప్రజల్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం చింతమనేని పై ఎన్నో కేసులు పెట్టి వేధించడంతోపాటు.. జైల్లో కూడా పెట్టింది. చింతమనేని ఎన్ని కేసులు ఎదుర్కొన్నా.. అవన్నీ పార్టీ కోసం, కార్యకర్తల కోసం కావటం విశేషం.
అధికార వైసీపీపై పోరాటం చేసే విషయంలో చింతమనేని స్ఫూర్తి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులలో ఎన్నోసార్లు జోష్ నింపిందనే చెప్పాలి. ఇక తాజా ఎన్నికల్లో మరోసారి.. గత ఎన్నికల్లో తలపడిన ప్రత్యర్థితోనే చింతమనేని తలపడుతున్నారు. టీడీపీ నుంచి చింతమనేని.. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి పోటీలో ఉన్నారు. అయితే గత కొద్ది నెలలుగా దెందులూరులో.. ఈసారి ఇద్దరి మధ్య చాలా గట్టి పోటీ నడుస్తుందని.. ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీతో బయటపడతారంటూ ప్రచారం జరుగుతుంది. వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నాలుగేళ్లలో వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించినా.. ఆయన పేరు చెప్పి ఆయన చుట్టూ ఉన్న అనుచరులు నానా దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడ్డారన్న విమర్శలు నియోజకవర్గంలో తీవ్రంగా ఉన్నాయి.
తన సొంత అనుచరులతో పాటు తన తండ్రి కొఠారు రామచంద్రరావు దందాలకు బ్రేకులు వేయలేకపోవడం అబ్బయ్య చౌదరికి మైనస్ గా మారిందన్న చర్చే బాగా వినిపిస్తోంది. ప్రభాకర్ దూకుడుగా ఉంటారన్న పేరుకు తగ్గట్టుగానే ప్రతిపక్షంలో ఉన్నా అదే పంథాలో ముందుకు వెళ్లారు. విచిత్రం ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలలో బాగా పాపులార్టి తెచ్చుకున్న ప్రభాకర్‌కు తన సొంత సామాజిక వర్గంలోనే కొన్నిచోట్ల వ్యతిరేకత కనిపిస్తోంది. కమ్మ సామాజిక వర్గం ప్రచారం ఎలా ? ఎల్లలు దాటి పోతుందో చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే దెందులూరు లో ఈసారి ప్రభాకర్‌కు గట్టి పోటీ ఉంటుందని సొంత సామాజిక వర్గంలోనే కొందరు గ్లోబల్ ప్రచారం చేయడంతోనే ప్రభాకర్‌కు ఈసారి అక్కడ గట్టి పోటీ ఉంటుందన్న టాక్ బయటకు వినిపించింది.
వాస్తవంగా చూస్తే ఈసారి దెందులూరు నియోజకవర్గ ఓటరు ప్రభాకర్ కు పట్టం కట్టేందుకు డిసైడ్ అయిపోయి ఉన్నారు. ప్రభుత్వంపై తీవ్రంగా ఉన్న వ్యతిరేకత రాష్ట్రవ్యాప్తంగా కంటే దెందులూరు నియోజకవర్గంలో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. నాలుగేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యం. అబ్బయ్య చౌదరి దూకుడుగా లేకపోయినా నియోజకవర్గంలో ఆయనను కలిసేందుకు సామాన్య కార్యకర్త ఆపసోపాలు పడాల్సిన పరిస్థితి. చెప్పుకోవటానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదు. చివరి ఏడాదిలో మాత్రం జగన్ ను బతిమిలాడుకుని నాలుగైదు రహదారులు మాత్రం పూర్తి చేయటం మినహా.. ఆయన ఐదేళ్ల పాలనలో నియోజకవర్గానికి ఒరిగింది ఏమీ లేదన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి.
పదేళ్ల ప్రభాకర్ పాలనలో దెందులూరు అభివృద్ధి 30 – 40 ముందుకు వెళితే.. ఐదేళ్ల అబ్బాయి చౌదరి పాలనలో 20 ఏళ్లు వెనక్కి పోయిందన్న సెటైర్లు ఇప్పుడు నియోజకవర్గంలో జోరుగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా దెందులూరు నియోజకవర్గ ఓటరు ఈసారి మార్పు కోరుకుంటున్న వైనం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోంది.