టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో సిఐడి అధికారులపై టిడిపి నేతలు పరోక్షంగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా సిఐడిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. నాలుగు వేల పేజీలతో స్టోరీ రాసిన సిఐడి చీఫ్ సినిమా డైరెక్టర్ లాగా కట్టుకథ బాగా అల్లారని చింతమనేని ఆరోపించారు. ఏలూరులోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను పరిశీలించిన తర్వాత చింతమనేని మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కీం లో అవినీతి జరిగిందంటూ గోబెల్స్ ప్రచారం చేశారని, చంద్రబాబు నాయుడును అకారణంగా 28 రోజులుగా జైల్లో ఉంచారని విమర్శించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీములో స్కాం జరిగిందని సిఐడి చీఫ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, స్కిల్ కేంద్రాల ద్వారా వేలాది మంది యువతకు చంద్రబాబు శిక్షణ ఇప్పించారని గుర్తు చేశారు. అందుకు నిదర్శనమే ఏలూరులోని ఈ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రమని చింతమనేని చెప్పారు.
ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రస్తావన లేనప్పుడే ఆ ప్రాంతంలో హెరిటేజ్ సంస్థ భూములు కొనుగోలు చేసిందని టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ చెప్పారు. హెరిటేజ్ భూములు కొనే సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్డు లేదని, ఇంకా చెప్పాలంటే అలైన్మెంట్ తర్వాత హెరిటేజ్ సంస్థ భూములను కోల్పోతుందని అన్నారు. మాజీ మంత్రి నారాయణ అద్దె భవనంలో కాలేజీ నడుపుతున్నారని, ఆ బిల్డింగ్ కోసం అలైన్మెంట్ మార్చారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ ది దరిద్రపు పాదం అని, అందుకే అమరావతి నాశనం అయిందని అన్నారు. చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులు నిలబడవని బోండా ఉమ చెప్పారు. పదేపదే అబద్దాలను ప్రచారం చేసి వాటిని నిజాలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.