సింగర్ చిన్మయి శ్రీపాద…టాలీవుడ్ లో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలో గాయనిగా చిన్మయికి వచ్చిన గుర్తింపుతో పోలిస్తే…మీటూ ఉద్యమం వల్ల ఆమెకు వచ్చిన గుర్తింపు చాలా ఎక్కువ. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్, నటీమణులు, మహిళలపై వేధింపుల వ్యవహారంలో చిన్మయి తీవ్రంగా స్పందిస్తుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చిన్మయి…అదే వేదికగా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా చిన్మయి చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఈ సమాజం రేపిస్ట్‌లను ప్రేమిస్తుందంటూ చిన్మయి చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. తనకు జరిగిన అన్యాయాన్ని నిలదీసి నిజం మాట్లాడినందుకు పార్వతి వంటి ప్రతిభ ఉన్న నటి అవకాశాలను కోల్పోయిందని, లైంగిక వేధింపుల బాధితుల తరఫున మాట్లాడటం వల్లే ఇలా జరిగిందని చిన్మయి ట్వీట్ చేశారు. ఆ సమస్యపై చాలామంది మౌనం వహించారని, సాటి మహిళ కోసం గొంతెత్తిన వారు మాత్రం సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు.
2017లో కేరళలో నటి భావన మీనన్ కిడ్నాప్, అత్యాచార వేధింపుల కేసులో నటుడు దిలీప్ కుమార్ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బెయిల్‌పై బయటికొచ్చిన దిలీప్ కు వ్యతిరేకంగా మలయాళ నటి పార్వతి తిరువోత్, ఐశ్వర్యా లక్ష్మీ గళం విప్పారు. మహిళా సంఘాలతో కలిసి భావనకు మద్దతుగా పోరాటం చేశారు. కానీ, ఆ పోరాటం మధ్యలోనే ఆగిపోయింది.
అయితే, భావనుకు మద్దతుగా నిలిచిన కారణంగా తాను చాలా అవకాశాలు కోల్పోయానని నటి పార్వతి తెలిపారు. చేతిలో హిట్ సినిమాలు ఉన్నా కూడా అవకాశాలు రానివ్వకుండా చేశారని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడటమే నేరమైందని పార్వతి వాపోయారు. ఈ క్రమంలోనే పార్వతి ఆవేదనపై చిన్మయి ట్వీట్ చేశారు. ఇక, ఇటీవల నటి భావన కూడా ఐదేళ్ల తర్వాత తనకు జరిగిన అన్యాయం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.