కాషాయ వస్త్రధారి అయిన స్వామీజీకి ఎందుకీ తగువు.ఎప్పుడో మరిచిపోయిన వీడియోను తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన డిజిటల్ వింగ్ ఎందుకు వెలుగులోకి తెచ్చింది.. ఈ ఆరోపణను తెలంగాణ డిజిటల్ వింగ్ ఇంఛార్జ్ ఎందుకు ఖండించలేకపోతున్నారు?
అదేవిధంగా కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం అయిన ఆ తల్లులను ఉద్దేశించి జియరు స్వామీజీ తన సైద్ధాంతిక సంఘర్షణలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారా? ఇంకా చెప్పాలంటే ఒక్క జియరు స్వామీజీ చేసిన పనులు లేదా చెప్పిన మాటలు కారణంగా తెలంగాణలో జంతు బలులు ఆగిపోతాయా? ఇవీ ఇవాళ వినిపిస్తున్న ప్రధాన ప్రశ్నలు వీటికి ఆన్సర్ ఇవ్వాల్సింది జియరు స్వామి.. వీటిని ఎదుర్కొని రాజకీయ గందరగోళానికి తెర దించాల్సిన బాధ్యత తెలంగాణ ఇంటి పెద్ద కేసీఆర్ ది కూడా! ఈ వివాదంలో మరో వాదన తాజాగా సోషల్ మీడియా కేంద్రంగా వినిపిస్తోంది. అదేంటంటే…
తెలంగాణ కేంద్రంగా గత కొద్ది రోజులుగా సమక్క సారక్కలపై జియరు స్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కోట్ల మంది ప్రజల విశ్వాసాలను కాలరాస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమంత సహేతుకంగా లేవని హిందూ సమాజంలో ఒక వర్గం మండిపడుతోంది. పిల్ల పాపలకు వరాలిచ్చే తల్లులుగా ఆ వనదేవతలు ఎన్నోఏళ్లుగా నిరాజనాలు అందుకుంటున్నారని, వారి నేపథ్యం తెలియక స్వామీజీ ఈ వ్యాఖ్యలు చేశారా అని తాము అనుకోవాలా అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు.
రాజకీయ నాయకులకు దగ్గరగా ఉండే జియరు స్వామీజీ పై ప్రజా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వేల కోట్ల ఆస్తులు పోగేసుకున్న చరిత్ర సమక్క సారక్కలకు లేదని, కానీ జియరు స్వామి ఒక్క ఆశ్రమం విలువే వేయి కోట్లు పైగా ఉంటుందని కమ్యూనిస్టులు కూడా తీవ్ర స్వరం వినిపిస్తున్నారు.ఈ దశలో జియర్ స్వామి తరఫు మనుషులు కూడా అంతే స్థాయిలో స్పందిస్తున్నారు. ముఖ్యంగా యతి నింద మహాపాపం అని వంశక్షయం అని కూడా అంటున్నారు.
యతినింద వంశక్షయం..నాశనము కాబోతుంటే ఎవ్వరూ కాపాడలేరు..పరమపదం పక్కన పెడితే మీరు పడే నరక యాతనకు ముందస్తుగా నా సానుభూతి..మీరు మా మిత్రులు అయినా మా సన్నిహితులు అయినా యతినింద వల్ల ఆందోళనా జీవులే! అని జియరు భక్తులు మాట్లాడుతున్నారు.
మరోవైపు పది పదిహేనేళ్ల కిందట ఏం జరిగిందో కూడా జియరు భక్తులు వివరిస్తున్నారు.మేడారం జాతర తరువాత భక్తులు సమర్పించే బెల్లం కుండలు అన్నీ నాటు సారా తయారీకి తరలిపోయేవని, వాటిని ప్రభుత్వం నియంత్రించలేకపోయేదని మరో వాదన ఒకటి వినిపిస్తున్నారు. దీని వల్ల హైందవ సంస్కృతికి తీవ్రమయిన విఘాతం ఏర్పడుతోందని స్వామి వారి భావన అని మరో మాట వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే స్వామి ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని, అంతేకాని సమక్క సారక్కలంటే తమ స్వామికి ఎటువంటి వివక్షా లేదని వివరిస్తున్నారు. అదేవిధంగా మేడారం జాతర కేంద్రంగా గోవధ కూడా ఉండేదని అంటున్నారు.
జంతు బలులు అన్నవి హైందవంలో లేవని వీటిని నివారించేందుకు స్వామి ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆ విధంగా అక్కడ ఒక వ్యాపార పోకడ నడుస్తోందని ఆయన ఉద్దేశం అని వీడియో విన్నవారు వినని వారు ఎవరి భాష్యం వారు చెప్పుకోవడం తగదని హితవు చెబుతున్నారు.
చినజీయర్ వివరణ :
. అంతర్జాతీయ వైదిక మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలో చినజీయర్ స్వామి ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. “ఈ మధ్య కొన్ని వివాదాలు తలెత్తాయి. అవి ఎలా పుట్టుకువచ్చాయో తెలియదు. గ్రామదేవతలను తూలనాడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. కానీ, అది వాస్తవం కాదు. పనికట్టుకుని.. వాళ్ల సొంత లాభం కోసమే కొందరు ఇదంతా చేస్తున్నారు.“ అని పేర్కొన్నారు.