డ్రాగన్ వేసుకున్న ముసుగు మెల్లిగా తొలగిపోతోంది. తాజాగా సైనిక శిబిరాన్ని సందర్శించిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడుతూ యుద్ధానికి సిద్ధం కావాలంటూ సైనికులకు పిలుపునివ్వటం సంచలనంగా మారింది. గ్వాంగ్దాండ్ మిలిటరీ బేస్ ను సందర్శించిన సందర్భంగా అధ్యక్షుడు చాలాసేపు సైనికాధికారులతో సమావేశమయ్యారు. భారత్-చైనా సరిహద్దుల్లోని తాజా పరిస్ధితులపై సైనికాధికారులతో సమీక్షలు జరిపారు. తర్వాత సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎక్కడా ప్రత్యర్ధి పేరెత్తకుండానే యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపివ్వటం సరిహద్దు ప్రాంతాల్లో కలకలం రేపుతోంది.
సైనికులందరూ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, దేశానికి విధేయంగా పనిచేయాలంటూ పిలుపునివ్వటమే ఆశ్చర్యంగా ఉంది. నిజానికి ఇష్టం ఉన్నా లేకపోయినా యుద్ధమంటూ మొదలైతే సైనికులకు పోరాడటం తప్ప వేరే గత్యంతరం లేదు. ఇంతోటిదానికి దేశానికి విధేయులుగా ఉండాలంటు చెప్పటంలో అర్ధమేంటి ? సైనికులు తమ శక్తి సామర్ధ్యాలన్నింటినీ యుద్ధంపైనే కేంద్రీకరించాలని అధ్యక్షుడు చెప్పారు. మనస్సు మొత్తాన్ని యుద్ధం వైపే నడిపించమని కూడా ఆదేశించారు.
ప్రత్యర్ధి పేరును ప్రస్తావించకపోయినా జిన్ పింగ్ మాటల్లోని ఉద్దేశ్యం మాత్రం భారత్ అనే రక్షణ రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే కొద్ది నెలలుగా భారత్ సైనికులను లక్ష్యంగా చేసుకుని డ్రాగన్ సైన్యాలు నానా కంపు చేస్తున్న విషయం తెలిసిందే. కావాలనే భారత్ భూభాగంలోని లడ్డాఖ్ లోయలోని ప్యాంగ్యాంగ్ సరస్సు, గాల్వాన్ లోయలో పదే పదే ఉధ్రిక్తతలు సృష్టిస్తున్న విషయం అందరం చూస్తున్నదే. కావాలనే సరిహద్దులోకి చొచ్చుకురావటం గొడవలు పడటం డ్రాగన్ సైనికులకు అలవాటుగా మారిపోయింది. కాబట్టి జిన్ పింగ్ పిలుపును దృష్టిలో పెట్టుకుని సైన్యం అప్రమత్తంగా ఉండాలని సైనికాధికారులు కూడా చెబుతున్నారు.