అభివృద్ధిలో చైనా ఎంత గొప్ప స్థాయిలో అయినా ఉండొచ్చు. కానీ అక్కడి ప్రజలకు స్వేచ్ఛ లేదు. నియంతల రాజ్యంలో ప్రభుత్వం ఏం చెబితే అది చేయాల్సిందే. ప్రజలకు ఇష్టం లేకున్నా ప్రభుత్వ ఆదేశాల్ని అనుసరించాల్సిందే. చైనా అంతర్గత విషయాలు బయటికి రాకపోవడం వల్ల జనాల ఇబ్బందులు వెలుగులోకి రావు కానీ.. నిజానికి ప్రభుత్వం తీరుతో ప్రజలు కొన్నిసార్లు తీవ్ర అవస్థలు పడుతుంటారన్నది విశ్లేషకుల మాట.
కరోనా టైంలో చైనాలో ఎన్నో దారుణాలు చోటు చేసుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ వైరస్ను అడ్డుకునేందుకు తయారు చేసిన వ్యాక్సిన్ విషయంలో చైనా నియంత్రత్వ ధోరణితో అక్కడి జనాలు ప్రమాదంలో పడుతున్నట్లు తాజాగా వార్తలొస్తున్నాయి.
చైనా ప్రభుత్వం ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్న కరోనా వ్యాక్సిన్ను అక్కడి జనాలకు విచ్చలవిడిగా ఇచ్చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. హై రిస్క్ కేటగిరీలను విభజించి డాక్టర్లు, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు, టీకా తయారీ సంస్థల సిబ్బంది, టీచర్లకు అత్యవసర ప్రాతిపదికన ఇంకా క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేసుకోని వ్యాక్సిన్లను ప్రభుత్వం బలవంతంగా ఇచ్చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి.
చైనాలో తయారు చేసిన వ్యాక్సిన్లకు డబ్ల్యూహెచ్వో సహా ఏ సంస్థల అనుమతీ రాలేదు. క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి కాలేదు. కానీ వీటికి అత్యవసర అనుమతులు ఇచ్చి హై రిస్క్ జోన్లో ఉన్న లక్ష మందిని ఎంచుకుని వారికి టీకాలు వేసేసిందట చైనా.
ఈ విషయాలేవీ బయటకు రాకుండా.. వారి నోరు కట్టేసేందుకు కొన్ని ఒప్పందాలపై వారి సంతకాలు కూడా తీసుకుందట. మీడియాకు ఈ వార్తలు పొక్కకుండా చైనా ప్రభుత్వం జాగ్రత్త పడినప్పటికీ ఇంటర్నేషనల్ మీడియాకు సమాచారం లీక్ కావడంతో దీనిపై దుమారం రేగుతోంది.